17 April, 2026 | 7:48 PM

నాయకపొడులను స్వతంత్ర తెగగా గుర్తించాలి – పదుల బుచ్చయ్య

17-04-2026 06:38 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శుక్రవారం దమ్మపేట మండల కేంద్రంలో నాయకపోడు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పసుల బుచ్చయ్య అధ్యక్షతన, రాష్ట్ర సెక్రటరీ భోగిరస్వామి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సెక్రెటరీ తాళ్ళ దుర్గయ్య ఆధ్వర్యంలో నాయకపోడు సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పసుల బుచ్చయ్య మాట్లాడుతూ... ​1949లో చెంచు, గోండు, కొలమ్, కోయ, నాయకపోడు వంటి 9 గిరిజన తెగలను గుర్తించారని, ఆ తర్వాత 1950లో మరో తెగను కలిపి మొత్తం 10 తెగలను గుర్తించారని, ​తొలుత స్వతంత్ర తెగగా ఉన్న నాయకపోడు తెగను, ఆ తర్వాత గోండు తెగలో ఉపకులంగా కలిపివేయడం వల్ల తమ ప్రత్యేక గుర్తింపును, ప్రయోజనాలను కోల్పోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

​తమను ప్రత్యేక తెగగా గుర్తించాలని 2025 సంవత్సరంలో తెలంగాణ గవర్నర్, ట్రైబల్ వెల్ఫేర్ అధికారులకు వినతులు అందించామనీ, ​దీనిపై చర్చలు జరిపి, నాయకపోడులను స్వతంత్ర గిరిజన తెగగా ప్రకటించడానికి 6 నెలల సమయం కోరారని, 2026 ఫిబ్రవరి 28 లోపు ప్రకటిస్తామని హామీ ఇచ్చారని, ​ప్రభుత్వం ఇటీవల (16-04-2026 నాటి రిపోర్టు ప్రకారం) నాయకపోడుల జనాభాను కేవలం 16,000 గానే చూపిస్తోందని, ఇది వాస్తవ విరుద్ధమని వారు తెలిపారు. ​రాష్ట్రంలో నాయకపోడుల జనాభా సుమారు 6,00,000 (ఆరు లక్షలు) పైచిలుకు ఉంటుందని, ​తమ జనాభాను తక్కువ చేసి చూపడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ, నాయకపోడు తెగను స్వతంత్ర తెగగా గుర్తించి, ఖచ్చితమైన జనాభా లెక్కలను ప్రకటించాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో  కాసిని శ్రీనివాసరావు, పూసి నరేష్, గుల్లా రాంబాబు తదితరులు పాల్గొన్నారు.