calender_icon.png 22 February, 2026 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నృత్యమే శ్వాస

22-02-2026 12:00:00 AM

పదివేల మందికి కళా ప్రకాశం 

కూచిపూడిలో డాక్టరేట్ సాధించిన నాట్య తపస్విని

తండ్రి అభ్యంతరం చెప్పినా తల్లి ప్రోత్సాహంతో రహస్యంగా పాఠాలు

విదేశాల్లోనూ వారసత్వాన్ని కొనసాగిస్తున్న కుమార్తెలు

మిరకిల్ వరల్డ్ రికార్డ్ సాధించి.. పదివేల మంది శిష్యులను తీర్చిదిద్దిన ఘనత 

నాట్య మాతృమూర్తి డా. ఝాన్సీ రామ్ ఆత్మీయ ఇంటర్వ్యూ

హైదరాబాద్ సిటీబ్యూరో,  ఫిబ్రవరి 21 (విజయక్రాంతి): భారతీయ సంస్కృతికి నాట్యం ఒక అలంకారం. అయితే, ఆ నాట్యకళకే తన జీవితాన్ని అంకితం చేసిన అరుదైన కళాకారిణి డా. ఝాన్సీ రామ్. నాచారంలోని చిన్నగదిలో మొదలైన ఆమె ప్రస్థానం, నేడు ప్రపంచవ్యాప్తంగా పదివేల మంది శిష్యులను తయారు చేసే స్థాయికి ఎదిగింది. లహరి శ్రీ నృత్య నికేతన్ వ్యవస్థాపకురాలిగా, నృత్యంలో డాక్టరేట్ సాధించిన మేధావిగా ఆమె ప్రయాణం ఎందరో వర్ధమాన కళాకారులకు స్ఫూర్తిదాయకం. రంగమన్నార్, ఇంద్రావతి దంపతుల ఏడుగురు సంతానంలో చివరి బిడ్డగా జన్మించిన ఆమె, అడ్డంకులను అధిగమించి నాట్య శిఖరాన్ని ఎలా అధిరోహించారో మనకు వివరించారు. ఆ ఆత్మీయ ఇంటర్వ్యూ విశేషాలు ఆమె మాటల్లోనే..

బాల్యం అడ్డంకులు 

చిన్నప్పటి నుంచే నాకు నాట్యం అంటే ప్రాణం. ఐదేళ్ల ప్రాయంలోనే నాలోని కళాతృష్ణను అమ్మ ఇంద్రావతి గుర్తించింది. కానీ నాన్న రంగమన్నార్ గారికి నేను నాట్యం నేర్చుకోవడం అస్సలు ఇష్టం ఉండేది కాదు. అమ్మాయిలు కేవలం చదువుకే పరిమితం కావాలని ఆయన భావించేవారు. కానీ అమ్మ పట్టుదలతో, నాన్నకు తెలియకుండానే నాకు నాట్య పాఠాలు నేర్పించింది. నా మొదటి గురువు మాలతి గారి వద్ద ఓనమాలు నేర్చుకుని, ఆ తర్వాత మహా గురువు డా.నటరాజ రామకృష్ణ గారి వద్ద భరతనాట్యం, శ్రీమతి ప్రసన్న రాణి గారి వద్ద కూచిపూడిలో మెరుగులు దిద్దుకున్నా. గురువులు నేర్పిన క్రమశిక్షణే నన్ను ఈ రోజు నాట్యంలో డాక్టరేట్ సాధించేలా చేసింది.

కుటుంబ ప్రోత్సాహం 

జీవితంలో నా భర్త పాత్ర మరువలేనిది. ఆయన ఐఐటీలో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నా.. నా కళా సేవను ఎప్పుడూ గౌరవించేవారు. నాచారంలో అకాడమీ నిర్వహణలో ఆయన ఎంతో అండగా నిలిచారు. మా ముగ్గురు కుమార్తెలు కూడా నాట్యంలో ప్రావీణ్యం సంపాదించారు. ప్రస్తుతం వారు విదేశాల్లో సెటిల్ అయినప్పటికీ, అక్కడ మన భారతీయ సంస్కృతిని కాపాడుతూ నాట్య పాఠశాలలు నిర్వహి స్తుండటం నాకు గర్వకారణం. నా అల్లుళ్లు కూడా నా అభ్యున్నతికి సొంత కొడుకుల్లా సహకరిస్తున్నారు. మా ఇద్దరు కోడళ్లు లేరు అన్న వెలితిని వారు పూడ్చుతున్నారు.

సామాజిక బాధ్యత పురస్కారాలు

కళ కేవలం ప్రదర్శనకే కాదు, సేవకు కూడా ఉపయోగపడాలి. లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య సమాజం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా. ముఖ్యంగా వికలాంగ విద్యార్థులకు ఉచితంగా నాట్యం నేర్పించి వారిలో ఆత్మవిశ్వా సాన్ని నింపుతున్నా. నా కష్టానికి గుర్తింపుగా మిరకిల్ వరల్డ్ రికార్డ్‌లో చోటు దక్కడంతో పాటు నాట్య మనోరమ, నాట్య కౌముది వంటి బిరుదులు వరించాయి.

నేటి తరం పిల్లలు టెక్నాలజీ యుగంలో మన మూలాలను మర్చిపోకూడదు. నాట్యం అనేది ఒక గొప్ప వ్యాయామం ఏకాగ్రతను పెంచే సాధనం. నా చివరి శ్వాస వరకు మన కూచిపూడి కళా ప్రకాశాన్ని పంచుతూనే ఉంటా. ప్రస్తుతం నాచారంలోని స్థయిరత్న హైట్స్‌లో నివసిస్తున్న డా.ఝాన్సీ రామ్ తన అకాడమీ ద్వారా నిరంతరం కళా సేవను కొనసాగిస్తూ భావితరాలకు భారతీయ సంస్కృతిని వారసత్వంగా అందిస్తున్న తీరు అద్భుతం.

వేలాది మంది శిష్యులు.. వేల ప్రదర్శనలు 

లహరి శ్రీ నృత్య నికేతన్ ద్వారా ఇప్పటివరకు సుమారు పది మందికి పైగా శిష్యులను తయారు చేశాను. నా దగ్గర నేర్చుకున్న వారు నేడు ప్రపంచవ్యాప్తంగా సొంతంగా అకాడమీలు నిర్వహిస్తున్నారు. రవీంద్ర భారతి నుంచి మొదలై మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లోనూ వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చాను. ముఖ్యంగా యాదగిరిగుట్ట, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో చేసిన ప్రదర్శనలు ఆధ్యాత్మిక అనుభూతిని ఇచ్చాయి. అష్టలక్ష్మి స్తోత్రం, సాయి నామాలు వంటి అనేక రూపకాలకు నేనే స్వయంగా కోరియోగ్రఫీ చేయడం తృప్తినిచ్చింది.