28 February, 2026 | 7:53 PM

ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం

28-02-2026 03:59 PM

హనుమకొండ,(విజయక్రాంతి): సుబేదారి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో  శనివారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల సైన్స్ విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం శాస్త్రీయ ఆలోచన, పరిశోధనా దృక్పథం, విద్యార్థుల్లో విజ్ఞాన చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో సాగింది. 

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సంకర జ్యోతి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ విజ్ఞానం సమాజ ప్రగతికి పునాది అని, శాస్త్రీయ దృక్పథం ప్రతి విద్యార్థి ఆలోచనా విధానంలో స్థిరపడాలని ఆమె సూచించారు. 1928లో భారత భౌతిక శాస్త్రవేత్త  రామన్ ప్రభావాన్ని(రామన్ ఎఫెక్ట్) ప్రకటించిన రోజును స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. శాస్త్రం కేవలం పాఠ్యాంశంగా కాక, జీవన విధానంగా మారాలని ఆమె ఆకాంక్ష వ్యక్తం చేశారు.

వైస్ ప్రిన్సిపాల్ రెహమాన్ మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధనాత్మక దృక్పథంతో ముందుకు సాగితేనే దేశాభివృద్ధికి తోడ్పడగలరని తెలిపారు. డాక్టర్ అంజన్న రావు శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించిన పురోగతిని వివరించారు. డాక్టర్ ఆశీర్వాదం శాస్త్రీయ ప్రయోగాలు, ఆవిష్కరణలు యువతలో సృజనాత్మకతను పెంపొందిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో సైన్స్ విభాగాల లెక్చరర్స్  విద్యార్థులు పాల్గొన్నారు.