చేనేత కార్మికుల వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు
ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చిట్యాల, నకిరేకల్, ఆగస్టు 7(విజయక్రాంతి): చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వారి సేవలను కొనియాడారు. శుక్రవారం 12వ జాతీయ చేనేత దినోత్సవాన్ని(National Handloom Day) పురస్కరించుకుని నకిరేకల్ పట్టణంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, చేనేత కార్మికులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు చేనేత రంగం విశేష సేవలందిస్తోందని అన్నారు.
చేనేత అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాకుండా తరతరాలుగా వస్తున్న విలువైన వారసత్వ సంపద అని పేర్కొన్నారు. చేనేత కార్మికుల శ్రమ, నైపుణ్యం వల్లే భారతీయ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోందని కొనియాడారు. చేనేత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, వారి జీవనోపాధి మరింత మెరుగుపడేలా ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులకు 12వ జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, వారి కుటుంబాలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో చేనేత సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






