7 August, 2026 | 2:48 PM

దేశ రాజధానిలో భారీ వర్షాలు

07-08-2026 01:44 PM

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలోని పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. శుక్రవారం ఉదయం కూడా ఢిల్లీ భారీ వర్షం(Heavy rainfall) కురుస్తుంది. దీంతో భారత వాతావరణ శాఖ (IMD) 'ఆరెంజ్ అలర్ట్' జారీ చేయడంతో పాటు, రోజంతా మరింత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. నగరంలోని ప్రధాన కేంద్రమైన సఫ్దర్‌జంగ్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 1.3 డిగ్రీలు తక్కువగా, 25.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. స్టేషన్ల వారీగా డేటా ప్రకారం, పాలంలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 3.6 డిగ్రీలు తక్కువగా 23.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవ్వగా, లోధి రోడ్‌లో సాధారణం కంటే 0.8 డిగ్రీలు తక్కువగా 25.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.

రిడ్జ్ స్టేషన్‌లో సాధారణం కంటే 4.1 డిగ్రీలు తక్కువగా 22.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, అయనగర్‌లో సాధారణం కంటే 1.6 డిగ్రీలు తక్కువగా 24.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు. సైనిక్ ఫామ్స్ ప్రాంతంలో నీట మునిగిన రోడ్ల గుండా వెళ్లేందుకు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అటు అస్సాంలో వరద పరిస్థితి తీవ్రంగానే కొనసాగుతోంది. శుక్రవారం నాటికి మరో ఇద్దరు మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 97కు చేరగా, అలాగే 15 జిల్లాల్లో 1.68 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారని అధికారులు తెలిపారు. వరద నీటి వల్ల పట్టాలు దెబ్బతినడంతో దాదాపు రెండు వారాల పాటు నిలిచిపోయిన శివసాగర్ జిల్లా మీదుగా సాగే రైలు రవాణా వ్యవస్థను పునరుద్ధరించినట్లు ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) పేర్కొంది.