నేత్రపర్వంగా నందీశ్వరుని వార్షికోత్సవం
- స్వామివారికి రుద్రాభిషేకం , పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు
గణపురం,ఆగస్టు17 (విజయ క్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్లలో శ్రావణమాస ఉత్సవాల్లో భాగంగా తొలి సోమవారం నందీశ్వరుని 3వ వార్షికోత్సవాన్ని కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో నేత్రపర్వంగా నిర్వహించారు. 2024 సంవత్సరంలో నిజామాబాద్ సిపి పోతరాజు సాయి చైతన్య, కీర్తి దంపతుల చేతుల మీదుగా నందీశ్వరుని ప్రతిష్టించారు.
అప్పటినుండి ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వార్షికోత్సవం సందర్భంగా గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు, మాజీ సర్పంచ్ దూడపాక శోభా శంకర్ దంపతులు , అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం స్వామివారిని పట్టు వస్త్రాలతో ప్రత్యేకంగా అలంకరించారు.
శ్రావణ సోమవారం నాగుల పంచమి కావడంతో వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు భక్తులకు ఆశీర్వచనాలు తీర్థ ప్రసాదాలను అందజేశారు.






