కొనసాగుతున్న నాగులమ్మ జాతర
ఆకట్టుకున్న గిరిజన విన్యాసాలు
భక్త జనంతో కిక్కిరిసిన జాతర ప్రాంగణం
మంగపేట,(విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) మంగపేట మండలం వాగొడ్డుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని లక్ష్మీనర్సాపూర్ గ్రామంలోని శ్రీ నాగులమ్మ ఆలయంలో మహా జాతర(Nagulamma jatara ) అశేష భక్త జన సందోహం నడుమ వైభవంగా కొనసాగుతుంది. ఐదు రోజులు పాటు జరిగే ఈ మహా జాతరలో మూడవ రోజైన గురువారం పాలమాకు ఒర్రె నుండి కంకవనం ( వనదేవత ) ఆలయానికి రాక, ఎదుర్కొలు, నాగులమ్మ తల్లి - పగిడిద్ద రాజుల కళ్యాణం, అగ్ని గుండంలో నడవడం ప్రధాన కార్యక్రమాలు. గురువారం మధ్యాహ్నం పాలమాకు ఒర్రె వద్ద పూజారులు వన దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పాలమాకు ఒర్రె నుండి అమ్మ వారిని ( వన దేవతను ) భక్తిశ్రద్ధలతో డప్పు చప్పుళ్ళ మధ్య ఆలయానికి తీసుకువచ్చారు. జాతర సందర్భంగా గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో చేసిన దింసా నృత్యాలు, గుస్సాడి నృత్యాలు , పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. జాతరకు వచ్చిన భక్తులతో గురువారం ఆలయ, జాతర ప్రాంగణం కిక్కిరిసిపోయింది.





