సంతాన నాగమ్మ మందిరం వద్ద అన్నదాన వితరణ
బోధన్, ఆగస్టు 17(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని ఏకచక్రేశ్వర నగర్‌లో నాగుల పంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని సంతాన నాగమ్మ మందిరం వద్ద భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అన్నదాన వితరణ కార్యక్రమాన్ని బోధన్ మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి ప్రారంభించారు. నాగుల పంచమి సందర్భంగా సంతాన నాగమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మందిరానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
అనంతరం భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేసి భోజన వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా తూము పద్మ శరత్ రెడ్డి మాట్లాడుతూ పండుగల సందర్భంగా భక్తుల కోసం అన్నదానం నిర్వహించడం అభినందనీయమని, ఆధ్యాత్మికతతో పాటు సేవా భావాన్ని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో 15వ వార్డు కౌన్సిలర్ గుమ్మల అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కృష్ణ జాదవ్, పలువురు కౌన్సిలర్లు, ఆలయ నిర్వాహకులు, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






