17 August, 2026 | 4:06 PM

కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను కొనసాగించాలి

17-08-2026 01:45 PM

ఎన్నికల హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలి : మాజీ ఎమ్మెల్యే గండ్ర 

భూపాలపల్లి టౌన్, ఆగస్టు 17 (విజయక్రాంతి) : కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని భూపాలపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని నిలిపివేయడాన్ని నిరసిస్తూ జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌  కూడలిలో బీఆర్‌ఎస్‌ పార్టీ మహిళా విభాగంలో ఆధ్వర్యంలో చేపట్టిన భారీ ధర్నా, రాస్తారోకో కార్యక్రమానికి గండ్ర ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో కేసీఆర్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశపెట్టి పదేళ్లపాటు విజయవంతంగా అమలు చేసిందని గుర్తు చేశారు.

కాని ప్రస్తుత ప్రభుత్వం కోర్టులో సరైన వాదనలు వినిపించకపోవడంతో పథకంపై ఆంక్షలు వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని డిమాండ్‌ గండ్ర చేశారు. అదేవిధంగా మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని అన్నారు. అదేవిధంగా రైతులకు ఎకరాకు రూ.15 వేల ఆర్థిక సాయం, రైతు బీమా వంటి హామీలను కూడా అమలు చేయాలని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే సమయం కేటాయించకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం మాటలతో, ఎదురు దాడులతో ప్రజలకు ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోలేదని గండ్ర హెచ్చరించారు. ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరగా పాలన సాగిస్తూ ఎన్నికల హామీలను అమలు చేయాలని కోరారు. అనంతరం ధర్నా చేస్తున్న గండ్రతో పాటు నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, యూత్, బీఆర్ఎస్వి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.