ప్రజావాణితో సమస్యలకు పరిష్కారం
బెజ్జంకి, ఆగస్టు 17: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని సత్వరమే పరిష్కరించేందుకు బెజ్జంకి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
ప్రజావాణిలో మొత్తం 11 ఫిర్యాదులు అందాయి. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించిన 8 ఫిర్యాదులు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలకు ఒక్కో ఫిర్యాదు వచ్చినట్లు నోడల్ అధికారి, ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన 23 మంది అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. అందిన సమస్యలను ఆయా శాఖల అధికారులు పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
విద్యుత్, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖలకు సంబంధించిన సమస్యలను అక్షరదిక్ష ద్వారా పరిష్కరించగా, మిగిలిన ఫిర్యాదులను 30 రోజుల్లోగా పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. ప్రజలు ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని ఎంపీడీవో కడవెర్గు ప్రవీణ్ కోరారు.






