17 August, 2026 | 3:08 PM

సర్కారు అధికార గుర్తు.. 'మేఘా' కబ్జా..!

17-08-2026 02:08 PM

సనత్ నగర్ టిమ్స్ ప్రారంభోత్సవ పత్రికా ప్రకటనలో ప్రభుత్వ అధికారిక గుర్తు

కొన్ని పత్రికలకు ప్రభుత్వ గుర్తులో.. మరికొన్ని పత్రికలకు సర్కారు గుర్తు లేకుండానే ప్రకటనలు జారీ

పత్రికా ప్రకటనల ఖర్చును ప్రభుత్వం చెల్లిస్తోందా.. ప్రైవేటు గుత్తేదారు చెల్లిస్తున్నారా అనే అనుమానాలు

హైదరాబాద్, ఆగస్టు 17,(విజయక్రాంతి): ఆంధ్రా ప్రాంతానికి చెందిన బడా కాంట్రాక్టు కంపెనీలు తెలంగాణ రాష్ట్రంపై తమ అజమాయిషీని కొనసాగిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ప్రభుత్వం ఏ పని చేపట్టినా.. ఆంధ్రా గుత్తేదారులకే ఆ ప్రాజెక్టులను కేటాయిస్తూ.. ప్రభుత్వం కూడా బడా కంపెనీలకే దాసోహం అంటుందనే సందేహాలుకూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా సనత్ నగర్ లోని టిమ్స్(Sanathnagar TIMS) ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవం సందర్భంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీలదే ఇష్టారాజ్యంగా కనపడింది. పైగా ప్రభుత్వం అధికారిక గుర్తునుకూడా ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ యధేచ్ఛగా వాడుకోవడంపై రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు.

ప్రభుత్వం సొమ్ము.. ప్రైవేటు ప్రచారం..

హైదరాబాద్ సనత్ నగర్ లోని టిమ్స్ ఆసుపత్రిని సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా పలు పత్రికలకు ప్రకటనలు (అడ్వర్టైజ్మెంట్) ఇచ్చారు. నిజానికి ప్రభుత్వ కార్యక్రమం అయితే ప్రభుత్వమే సమాచార, పౌర సంబంధాల శాఖ ద్వారా పత్రికలకు ప్రకటనలు ఇస్తుంది. అలా కాకుండా.. పనులు చేసిన ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ అయితే సంస్థ తరఫున సొంతంగా ప్రకటనలు ఇచ్చుకుంటుంది. కానీ సోమవారం నాడు పలు పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో పూర్తిగా విరుద్ధమైన ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వం సొమ్ముతో ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ప్రచారం చేసుకున్నట్టుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా దీనికి ప్రభుత్వం అధికారిక గుర్తును ఉపయోగించడం గమనార్హం. అంటే ప్రభుత్వంపై ప్రైవేటు కంపెనీ అజమాయిషీ చేస్తోందా.. ఇలా చేయడం వల్ల.. ప్రజలను తప్పుదోవ పట్టించడం కాదా అనే అనుమానాలుకూడా వ్యక్తమవుతున్నాయి.

సోమవారం నాడు పలు పత్రికలకు విడుదల చేసిన ప్రకటనల్లో.. పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. కొన్ని పత్రికల్లో ప్రభుత్వ అధికారిక గుర్తుతో ప్రకటనలు వచ్చాయి. తెలంగాణ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖ పేరునుకూడా వాడుకున్నారు. అయితే ప్రభుత్వం ఈ ప్రకటన జారీచేస్తే.. ప్రైవేటు కాంట్రాక్టు కంపెనీ పేరును ప్రముఖంగా ప్రచురించడం ఇక్కడ గమనార్హం. అదే మరికొన్ని పత్రికల్లో ప్రభుత్వ అధికారిక గుర్తు లేకుండానే ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ప్రకటనలా కపడేలా ఇచ్చారు. అంటే ఒకే ప్రకటనను.. రెండు విధాలుగా ఎలా ఇచ్చారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఒకవేళ ప్రభుత్వం సొమ్ముతో ప్రకటన జారీచేస్తే.. ప్రైవేటు కాంట్రాక్టు సంస్థకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. పోనీ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థనే ప్రకటనలు ఇస్తే.. ప్రభుత్వ అధికారిక గుర్తును వాడుకోవడం సరైందేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రకటనల ఖర్చు ప్రభుత్వానిదా.. లేక ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ భరిస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ పేరుతో 'మెగా' ప్రచారం చేసుకున్నట్టుగా మాత్రం ఆ ప్రకటన చూస్తే అర్ధమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఎటొచ్చీ ప్రభుత్వ అధికారి గుర్తును వాడుకోవడంపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. అంటే.. ప్రభుత్వ గుర్తును 'మెఘా' కబ్జా చేసి.. ప్రజలను తప్పుదారి పట్టించినట్టు కాదా అంటు పలువురు ప్రశ్నిస్తున్నారు.