17 August, 2026 | 4:07 PM

ప్రభుత్వంపై బురద జల్లుతున్నారు: మంత్రి వాకిటి

17-08-2026 02:50 PM

హైదరాబాద్: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పై వస్తున్న వార్తలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి స్పందించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) తెచ్చిన పథకాన్ని సదుద్దేశంతో కొనసాగించామని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గత ప్రభుత్వం కల్యాణ లక్ష్మి చెక్కులను వివాహమైన రెండేళ్లకు ఇచ్చేదని మంత్రి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్ర 3 నెలల్లోపు కల్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిందని సూచించారు. రైభరోసాను రూ. 12 వేలకు పెంచి కొనసాగించామని తెలిపారు. కోర్టు స్టే వల్ల చిన్న అవాంతరం వస్తే.. ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కోర్టు వివరణ అడిగినంత మాత్రాన.. పథకాలు నిలిచిపోవని మంత్రి వాకిటి స్పష్టం చేశారు.

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం పేర్కొన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ "మొసలి కన్నీరు" కారుస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం 'గ్రీన్ ఛానల్' ద్వారా పథకాలకు నిధులను విడుదల చేస్తోందని, పేద కుటుంబాలకు వాటి వల్ల ప్రయోజనం కొనసాగేలా చూసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటుందని పొన్నం హామీ ఇచ్చారు. ఈ పథకాల కింద ఇప్పటివరకు రూ. 16,375.87 కోట్లు ఖర్చు చేయగా, 16,78,347 మంది లబ్ధి పొందారు. ఇవి సంక్షేమ పథకాలే తప్ప, ఏ చట్టాన్నైనా అమలు చేసే ఉద్దేశంతో చేపట్టినవి కావని మంత్రి పేర్కొన్నారు.