కర్మాగారంలో పేలుడు: 19కి పెరిగిన మృతుల సంఖ్య
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని నాగ్‌పూర్(Nagpur Explosives Factory Blast) పేలుడు పదార్థాల కంపెనీ పేలుడులో సోమవారం మరొకరు మరణించడంతో మృతుల సంఖ్య 19కి పెరిగిందని పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ఇరవై మూడు మంది కార్మికులు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని ఒక పోలీసు అధికారి తెలిపారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో పేలుడు పదార్థాల తయారీ కంపెనీకి చెందిన తొమ్మిది మంది డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఆ పేలుడులో 18 మంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు సోమవారం తెలిపారు.
"నాగ్‌పూర్‌లోని కల్మేశ్వర్ పోలీసులు ఎస్‌బీఎల్(SBL) ఎనర్జీ లిమిటెడ్‌లోని 21 మంది డైరెక్టర్లు, వాటాదారులపై భారతీయ న్యాయ సంహిత(Bharatiya Nyaya Sanhita) సెక్షన్ 105 (హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య) కింద కేసు నమోదు చేశారు" అని అధికారులు వెల్లడించారు. నాగ్‌పూర్‌లోని కటోల్ తహసీల్‌లోని రౌల్‌గావ్‌లో ఆదివారం ఉదయం మైనింగ్, పారిశ్రామిక పేలుడు పదార్థాల తయారీ సంస్థ అయిన ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో జరిగిన శక్తివంతమైన పేలుడులో కనీసం 18 మంది కార్మికులు సజీవ దహనం కాగా, 24 మంది గాయపడ్డారు. వారిలో ఎక్కువ మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్ (PESO), డిఫెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ సెక్యూరిటీ (Defense Information System for Security) ప్రాథమిక నివేదిక కంపెనీలో భద్రతా లోపాలను ఎత్తి చూపిందని నాగ్‌పూర్ గ్రామీణ పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ హర్ష్ పోద్దార్ సోమవారం తెలిపారు. ఈ నివేదిక ఆధారంగా పోలీసులు కంపెనీ అధికారులపై కేసు నమోదు చేశారని ఆయన వెల్లడించారు.




