18 March, 2026 | 2:33 PM

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు

18-03-2026 12:02 PM
  1. బఫర్ జోన్ లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తాం
  2. బీఆర్ఎస్ చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయి
  3. మూసీని జీవనదిగా మార్చడమే మా ఆలోచన 

హైదరాబాద్: మూసీ నదిని జీవనదిగా మార్చడమే తమ ఆలోచన అని మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్టు తొలి దశ డీపీఆర్ తయారైందని శ్రీధర్ బాబు వెల్లడించారు. తొలి దశ డీపీఆర్ రూ. 6,500 నుంచి 7000 కోట్లని, మూసీ పునర్నిర్మాణంలో 1,435 నిర్మాణాలు ప్రభావితమయ్యే అవకాశముందని తెలిపారు. తుది ఎన్యూమరేషన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. బఫర్ జోన్ లో ఉన్నవారికి టీడీఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు. 2013 చట్టం ప్రకారం భూసేకరణ, పునరావాసం ఉంటుందని సూచించారు.

గతంలో ఇచ్చిన జీవో ప్రకారమే బఫర్ జోన్ నిర్ణయించామన్నారు. తాము కొత్తగా బఫర్ జోన్ నిర్ణయించలేదన్నారు. 2024 డిసెంబర్ లో మొయిన్ హార్ట్ కు డీపీఆర్ బాధ్యతలు అప్పగించామని తెలిపారు. 2026 ఫిబ్రవరిలో మెయిన్ హార్ట్ సంస్థ డీపీఆర్ అప్పగించిందని వివరించారు. కేటీఆర్ ఆరోపిస్తున్నట్లు మూసీ డీపీఆర్ రెండు నెలల్లో పూర్తి కాలేదన్నారు. వచ్చే ఏడీబీ బోర్డు మీటింగ్ లో మూసీ ప్రాజెక్టు అనుమతి లభించే అవకాశముందని తెలిపారు. బీఆర్ఎస్ చేపట్టిన ప్రాజెక్టులను  కాంగ్రెస్ పార్టీ ఆపేసిందని బీఆర్ఎస్ ఆరోపించడంపై మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు ప్రాజెక్టులు తాము నిలిపేసినట్లు ఆరోపించడం సరికాదని హెచ్చరించారు.

ఎస్టీపీలకు సంబంధించి బీఆర్ఎస్ హయాంలో 30 శాతం పనులు పూర్తయ్యాయి. పెండింగ్ లో ఉన్న 70 శాతం పనులు తమ హయాంలో పూర్తయ్యాయని వివరించారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన పనులు.. చిన్న వరదకే కొట్టుకుపోయాయని ఆరోపించారు. మంత్రి శ్రీధర్ బాబు సమాధానం ఎవరికీ సంతృప్తిగా లేదని కేటీఆర్ పేర్కొన్నారు. తొలి దశ రూ, 7 వేల కోట్లు అన్నారు.. ఇంకా ఎన్ని దశలు ఉంటాయి? అని కేటీఆర్ ప్రశ్నించారు. రూ. 16 వేల కోట్లతో అయ్యే ప్రాజెక్టుకు సీఎం రేవంత్ రెడ్డి లక్షన్నర కోట్లు చెబుతున్నారని కేటీఆర్ ఆరోపించారు