18 March, 2026 | 2:34 PM

సీఎం హెలిప్యాడ్ కోసం తాటి చెట్లు నరకడమేంటి?

18-03-2026 12:25 PM

నంగునూరు,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పర్యటన కోసం గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీస్తూ తాటి చెట్లను నరకడం సరికాదని మండల బిఆర్ఎస్ అధ్యక్షులు అనగోని లింగం గౌడ్,సహకార సంఘం మాజీ చైర్మన్ కోల రమేష్ గౌడ్ లు ఆగ్రహం వ్యక్తం చేశారు.నంగునూరు మండలం నర్మెట్టలో ఈ నెల 22న సీఎం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్న నేపథ్యంలో, హెలిప్యాడ్ ఏర్పాటు కోసం అధికారులు తాటి చెట్లను తొలగించడాన్ని బిఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.

ఫ్యాక్టరీ చుట్టుపక్కల ఉన్న తాటి చెట్లపై సుమారు 60 మంది గీత కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారని, వాటిని నరకడం వారి పొట్ట కొట్టడమేనని నాయకులు పేర్కొన్నారు.హెలిప్యాడ్ ఏర్పాటుకు ఫ్యాక్టరీ సమీపంలో ఇతర ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ,కావాలనే రైతు పొలాల్లోని చెట్లను తొలగిస్తున్నారని వారు  మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పుప్పాల నారాయణ, గీత కార్మిక సంఘం నాయకులు యాదగిరి గౌడ్, రాములు గౌడ్, శేఖర్ గౌడ్ ,నాయకులు సతీష్ గౌడ్,శ్రీనివాస్,చింటూ గౌడ్ లు తదితరులు పాల్గొన్నారు.