23 March, 2026 | 2:12 AM

భాషతో పనిలేదు.. భావోద్వేగాలే ముఖ్యం

23-03-2026 12:00 AM

తెలుగులో ‘సీతారామం’, ’హాయ్ నాన్న’, ‘ఫ్యామిలీ స్టార్’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన అందాల తార మృణాల్ ఠాకూర్.. హిందీలో ‘సూపర్ 30’, ‘బట్ల హౌస్’ వంటి చిత్రాల్లోనూ నటించింది. అయితే, మృణాల్ టాలీవుడ్ ప్రేక్షకులకు నాలుగేళ్లుగానే తెలుసు. కానీ, ఈ ముద్దుగుమ్మ సినిమాల్లోకి వచ్చి పుష్కరం పూర్తయిందని ఎంత మందికి తెలుసు? 21వ ఏటనే తొలి సినిమాలో నటించిన, మృణాల్‌కు సరైన బ్రేక్ రావడానికి చాలా ఏళ్లు పట్టిందట! సుమారు ఏడేళ్ల పాటు సినిమా కష్టాలకు తాను ఎదురు ఈదానని చెప్పింది బ్యూటీ.

ఈ క్రమంలో తాను ‘కెరీర్‌ను అలా ప్లాన్ చేసుకోవాలి.. ఇలా ప్లాన్ చేసుకోవాలి అని నేనెప్పుడూ అనుకోలేదు’ అని తెలిపింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ముఖ్యంగా కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెప్పుకొచ్చింది. ‘బయట వ్యక్తిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టడం, అవకాశాలు అందుకోవడం సవాలుతో కూడుకున్న పని. బాలీవుడ్‌లో నా తొలినాళ్లు చాలా కష్టంగా గడిచాయి.

కాలక్రమేణా ఆ అడ్డంకులు దాటుకొని నటిగా ఎదగడానికి కష్టపడుతున్నా. అలాగని నేను కెరీర్ ప్రారంభంలో ఇలా చేయాలి, అలా చేయాలి అని ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. కానీ, ఇప్పుడు మాత్రం అవకాశాలను ముందుగానే వెతకడం నేర్చుకున్నా. ఉత్తరాది, దక్షిణ చిత్రాల మధ్య కెరీర్‌ను బ్యాలెన్స్ చేస్తూనే ముందుకు వెళ్లాలనుకుంటున్నా. తమిళ పరిశ్రమలోకి కూడా అడుగు పెట్టాలనే ఆలోచన ఉంది. చాలా కథలు వింటున్నా. మంచి స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నా. అయినా నాకు భాషతో అవసరం లేదు. భావోద్వేగాలే ముఖ్యం. వివిధ భాషల్లో కూడా మంచి కథలు దొరకాలని, సినిమాలు చేయాలని కోరుకుంటున్నా’ అని చెప్పుకొచ్చింది.

ఇక మృణాల్ సినిమాల విషయానికొస్తే.. అడివి శేష్‌తో కలిసి ఆమె ప్రధాన పాత్రలో ‘డెకాయిట్’ సినిమాలో నటిస్తోంది. దర్శకుడు షనీల్ డియో ఈ సినిమాను ప్రతీకారేచ్ఛతో కూడిన రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. 13 ఏళ్ల విరామం తర్వాత అనుకోని పరిస్థితుల్లో కలుసుకున్న ఇద్దరు మాజీ ప్రేమికుల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కించిన ద్విభాషా యాక్షన్ డ్రామా ఇది. ఈ చిత్రం తెలుగు, హిందీ భాషల్లో ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.