14 March, 2026 | 2:41 AM

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముందస్తు చర్యలు తీసుకోవాలి

14-03-2026 12:18 AM

మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డికి లేఖ రాసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి 

నిజామాబాద్, మార్చి 13  (విజయక్రాంతి): రాబోయే గోదావరి పుష్కరాలు2027ను దృష్టిలో ఉంచుకుని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని గోదావరి నది తీర ప్రాంతాల్లో ఉన్న పుష్కర ఘాట్ల వద్ద సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఈ మేరకు రాష్ట్ర రోడ్లు,భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.  నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో గోదావరి తీరం వెంట ఉన్న ఘాట్లకు కోట్లాది భక్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. ముఖ్యంగా కందకుర్తి, పోచంపాడ్, తడపాకల్, వాల్గొండ వంటి ప్రధాన ఘాట్ల వద్ద భారీగా భక్తుల రద్దీ ఉండనున్నందున ఈ ప్రాంతాల్లో ప్రత్యేకంగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ఘాట్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, మరుగుదొడ్లు, పారిశుధ్య సదుపాయాలు, పోలీస్ భద్రత, సీసీ కెమెరాలు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు, అగ్నిమాపక సేవలు, విద్యుత్ సరఫరా, హైమాస్ట్ లైట్లు, ఆర్టీసీ   ప్రత్యేక బస్సులు, పార్కింగ్ ఏ ర్పాట్లు వంటి అంశాలపై ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఎంపీ కోరారు. పుష్కరాల సమయంలో కోట్లాది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసి పనులను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.