పెట్రోల్ కొరతతో బంకుల వద్ద వాహనదారులు క్యూ
కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో(Petrol Bunks) “నో స్టాక్” బోర్డులు కనిపించడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని పలు బంకుల్లో పెట్రోల్ నిల్వలు లేకపోవడంతో, జనకపూర్ ప్రాంతంలోని ఒక పెట్రోల్ బంక్‌లో మాత్రమే ఇంధనం అందుబాటులో ఉండటంతో అక్కడ భారీగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. పెట్రోల్ కోసం ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు గంటల తరబడి క్యూ లైన్‌లో నిలబడి వేచి చూడాల్సి వస్తోందని వాహనదారులు తెలిపారు.
పెట్రోల్ కొరత(Petrol Shortage) కారణంగా ఉదయం నుంచి బంక్ వద్ద పెద్ద ఎత్తున క్యూలు ఏర్పడి ట్రాఫిక్‌కు కూడా అంతరాయం కలుగుతోంది. కొంతమంది వాహనదారులు అవసరమైన పనులకు వెళ్లడంలో ఆలస్యం అవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ సరఫరా సాధారణ స్థితికి రావడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇంధన సరఫరాలో అంతరాయం రావడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని సమాచారం. త్వరలోనే సరఫరా పునరుద్ధరించబడుతుందని బంక్ నిర్వాహకులు తెలిపారు.




