12-02-2026 05:13:01 PM
చివ్వెంల,(విజయక్రాంతి): చివ్వెంల మండలంలోని అక్కలదేవిగూడెం గ్రామంలో కోతుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. గ్రామానికి చెందిన సుద్దగాని శ్రీ నిహాన్ష్ గౌడ్ అనే బాలుడిపై కోతులు అకస్మాత్తుగా దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నిన్న చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న సమయంలో కోతుల గుంపు బాలుడిపై దూసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడిలో బాలుడి చేతులు, కాళ్లపై గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు అతడిని సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
గ్రామంలో కోతులు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఇళ్ల బయటకు రావడానికి కూడా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి ఆహారం కోసం వస్తువులు చెదరగొడుతున్నాయని వారు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోతుల బెడదను నియంత్రించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని వన్యప్రాణి శాఖ తగిన చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.