జిల్లా కేంద్రంలో కోతుల బెడద.. భయాందోళనలో ప్రజలు
పలు కాలనీల్లో తీవ్ర సమస్య
అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజల విజ్ఞప్తి
ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. ముఖ్యంగా కసబ్‌వాడతో పాటు పలు కాలనీల్లో కోతుల గుంపులు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కోతులు గుంపులుగా ఇళ్లపైకి ఎక్కడం, వీధుల్లో తిరగడం, ఆహార పదార్థాలను ఎత్తుకెళ్లడం వంటి ఘటనలు పెరిగిపోయాయని చెబుతున్నారు.
కొన్నిచోట్ల చిన్నారులు, వృద్ధులపై దూకేందుకు ప్రయత్నించడం వల్ల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.ఇళ్ల ముందు ఆరబెట్టిన బట్టలు, కూరగాయలు, ఇతర వస్తువులను కోతులు ధ్వంసం చేస్తున్నాయని, దీంతో ఆర్థిక నష్టం కూడా కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. పిల్లలు బయట ఆడుకోవడానికి, మహిళలు ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కసబ్‌వాడ, పైకాజినగర్, జనకాపూర్ పలు నివాస కాలనీలు, ప్రధాన రహదారుల పరిసర ప్రాంతాల్లో కోతుల సంచారం అధికంగా ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికైనా అటవీ శాఖ, మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టి కోతులను జనావాస ప్రాంతాల నుంచి తరలించాలని ప్రజలు కోరుతున్నారు.కోతుల సమస్యపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి శాశ్వత పరిష్కారం చూపాలని, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కేంద్ర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.






