17 June, 2026 | 5:53 PM

గిరిజన సంస్కృతికి విరుద్ధంగా వ్యవహరించారు

17-06-2026 04:41 PM

* ఆదివాసీ మహిళల ఆవేదన..

* జన్నారం ఎఫ్ ఆర్ ఓ ఆఫీసులో  రాత్రి ఒంటిగంట వరకు కొట్టారు..

* మాజీ ఎంపీ సోయం ముందు  గోడు వినిపించిన బాధితులు

ఉట్నూర్,(విజయక్రాంతి): ఆదివాసులు అంటేనే.. ప్రకృతి పూజారులు.. ఆదివాసి గోండులు తమ సంస్కృతి సాంప్రదాయాలకు... ఆచార వ్యవహారాలకు  పెద్దపీట వేస్తారు. ఆచార వ్యవహారాలను, సంస్కృతి సాంప్రదాయాలను  కాపాడుకుంటూ ముందు సాగుతూ... ఆచార వ్యవహారాలను.. సంస్కృతి సాంప్రదాయాలను.. భావితరాలకు అందించే విధంగా వ్యవహరిస్తున్న  గిరిజనులపై  అడవి శాఖ అధికారులు  సంస్కృతిని కించపరిచే విధంగా  వివరిస్తూ.. బూటు కాలుతో  తన్నడం చేశారు.

నెలరోజుల బాలింత అని చూడకుండా  సాగు భూమి నుండి  ఈడుచుకు వెళ్లారని, తమను ప్రత్యేక వాహనంలో  మంచిర్యాల జిల్లా జన్నారం  మండల కేంద్రంలోని అడవి శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి  ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుతూ.. తీవ్రంగా కొట్టారని  మాజీ ఎంపీ, రాజ్ గోండు సేవా సమితి రాష్ట్ర శాఖ అధ్యక్షుడు  సోయం బాపూరావు ముందు  కన్నీరు మున్నీరు అవుతూ.. తమ గోడును విన్నవించుకున్నారు. బుధవారం కడెం మండలంలోని లచ్చన్న ఎల్లాపూర్ అనుబంధ గ్రామమైన  గోండు గూడ  కు చెందిన మహిళలు గ్రామస్తులు ఉట్నూర్ కు వచ్చారు.

ఈ సందర్భంగా మాజీ ఎంపీ సోయం బాపురావుతో మంగళవారం అడవి శాఖ అధికారులతో పాటు  పోలీసులు వ్యవహరించిన తీరుపై  కన్నీటితో బాపురావు దృష్టికి తీసుకువచ్చారు. ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయంగా  ఎన్నో కట్టుబాట్లతో జీవనం సాగిస్తున్న తమపై అడవి శాఖ అధికారులు  బూటు కాలుతో తన్నుతూ... గర్భిణీలు, బాలింతలు అంటూ చూడకుండా తీవ్రంగా కొట్టారని, తమ గూడెం నుండి మహిళలను జన్నారం అడవి శాఖ కార్యాలయానికి, మగవారిని  ఇంధన్ పల్లి అడవి శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి రాత్రంతా కొట్టారని మాజీ ఎంపీ సోయం బాపూరావు తో పాటు  ఐటీడీఏ పీవో  మంద మకరందు ముందు  తమ గూడును వినిపించారు. ఆదివాసీల  మహిళల  ఆవేదన గోడును విన్న  పి ఓ తో పాటు  మాజీ ఎంపీ  సోయం బాపు రాములు మాట్లాడుతూ.. మహిళలపై చేయి చేసుకోవడం నేరమన్నారు.

* నెలరోజుల బాలింతపై దాడి..

- రాయి సీడం ఎత్మ బాయి, లచ్చన్న ఎల్లాపూర్ , 

- గోండుగూడ..

 తమ జీవనాధారమైన  సాగు భూమిలోకి రావద్దని  అడవి శాఖ అధికారులు  భూమి వద్ద ఉండగా అక్కడికి వెళ్లిన తనపై  అడిశాక సిబ్బంది దాడి చేశారని  ఏత్మా బాయి అన్నారు. అడవి శాఖ సిబ్బంది  తనపై దాడి చేస్తుండగా  నెలరోజుల బాలింతను  తనను కొట్టవద్దని  వేడుకుంటే బూటు కాలుతో తన్నారని  ఆవేదనతో తెలిపింది. నెలరోజుల పాపను విడిచి రాత్రి ఒంటిగంట వరకు  జన్నారం అడవి శాఖ కార్యాలయానికి తీసుకువెళ్లి  ఒళ్ళు నొప్పులు వచ్చే విధంగా  తీవ్రంగా కొట్టారని  కన్నీరు మున్నిరయింది. అడవి శాఖ అధికారులకు  తనలాంటి బిడ్డ గాని చెల్లె గాని  ఉంటే ఇలాగనే కొట్టేవారని ప్రశ్నించారు. బాలింత అని మొత్తుకున్న  కనికరం లేకుండా కొట్టారని  ఆవేదనతో తెలిపింది.

* బూటు కాళ్లతో  కొట్టారు..

- నైతం గిరిజ బాయ్... లచ్చన్న ఎల్లాపూర్, కడెం మండలం

 గోండుల సంస్కృతి సాంప్రదాయాలు.. ఆచారాల వ్యవహారాలకు విరుద్ధంగా  తనను అడవి శాఖాధికారులు , సిబ్బంది బూటు కాళ్లతో తన్నారని నైతం గిరిజాబాయి తెలిపారు. మైసంపేట ప్రాంతంలో  జరిగిన గొడవ అనంతరం తమను ప్రత్యేక వాహనంలో  జన్నారం తీసుకువెళ్లి చీకటి గదిలో ఉంచి  విపరీతంగా కొట్టారని  ఆమె ఐటిడిఏపీఓ ముందు  కన్నీరు మున్నీరు అవుతూ  తెలిపింది. ఆదివాసుల సంస్కృతి సాంప్రదాయంగా తమ కులాచారానికి ముట్టు తగిలిందని, తన ముట్టు తీసే వరకు ఇంటి బయటనే జీవనం సాగించవలసి ఉంటుందని, పూజా పునస్కారాలకు, మంచి చెడులకు దూరంగా ఉండవలసి వస్తుందని ఆవేదనతో తెలిపింది. అడవి శాఖ అధికారులు తనపై బూట్ కాళ్లతో తన్నడం  తమ సంస్కృతికి విరుద్ధమని  అన్నారు. ముట్టు తీయాలంటే ఖర్చుతో కూడిన పని అని, తమ వద్ద ఉన్న డబ్బులు ఖర్చు పెడితే, వ్యవసాయం కుంటుపడుతుందని, వ్యవసాయం కొంటుపడితే ఏడాది పాటు బతకలేమని  ఆమె వాపోయింది. ఏడాది పాటు ముట్టుతో ఉండవలసిన పరిస్థితి తనకు  అడవి శాఖ అధికారులు తీసుకువచ్చారని  వాపోయింది.