17 June, 2026 | 5:52 PM

మంథని నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శ్రీకారం

17-06-2026 04:37 PM

మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చొరవ

మంథని,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ చూపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల నుండి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఏకంగా రూ. 5 కోట్ల 25 లక్షల నిధులను మంజూరు చేయించారు. ఈ నిధులతో నూతన గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణం, సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థల మెరుగుదల వంటి అత్యవసర అభివృద్ధి పనులను చేపట్టనున్నారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మరియు పాలకుర్తి మండలాలకు చెందిన పలు గ్రామాలకు ఈ నిధులు కేటాయించబడ్డాయి.

మంథని మండలంకు రూ. 2 కోట్ల 55 లక్షలు,

 రామగిరి మండలంకు రూ. 90 లక్షలు,

 ముత్తారం మండలంకు రూ. కోటి రూపాయలు, (పంచాయతీ భవనంతో కలిపి),

కమాన్‌పూర్ మండలంకు రూ. 60 లక్షలు,

పాలకుర్తి మండలంకు రూ. 20 లక్షలు మంజూరు అయ్యాయి.

ప్రజల హర్షాతిరేకాలు

మంథని నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో సైతం అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించడంపై స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని గ్రామ సర్పంచులు తెలిపారు. ఈ నిధులు గ్రామాల రూపురేఖలను మార్చనున్నాయని వారు పేర్కొన్నారు. అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని స్థానిక అధికారులు తెలిపారు.