17 June, 2026 | 6:45 PM

చిన్నారులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణి

17-06-2026 05:26 PM

చిట్యాల,(విజయక్రాంతి): మండల పరిధిలోని వట్టిమర్తి గ్రామ అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం చిన్నారులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం సరఫరా చేసిన నూతన దుస్తులను గ్రామ సర్పంచ్ మేడి శ్రీలత, ఆసరా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక చైర్మన్ మేడి హరికృష్ణ చేతుల మీదుగా చిన్నారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్నారుల్లో క్రమశిక్షణ, సమానత్వ భావన పెంపొందించడంలో యూనిఫామ్స్ కీలక పాత్ర పోషిస్తాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు అంగన్‌వాడీ కేంద్రంలోని పిల్లలందరికీ యూనిఫామ్స్ అందజేస్తున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రతిరోజూ పరిశుభ్రంగా ఉంచి, యూనిఫామ్స్ ధరింపజేసి సకాలంలో అంగన్‌వాడీ కేంద్రానికి పంపించాలని,  అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు నాణ్యమైన ప్రీ-స్కూల్ విద్యను అందిస్తున్నామని, పిల్లల సమగ్ర అభివృద్ధికి తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ బూరుగు అరుణ, అంగన్‌వాడీ సహాయకురాలు, చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు.