ధూప దీపా నైవేద్యానికి, వితంతువులకు ఆసరా అందిస్తున్న మొహమ్మద్ రఫీ
చేగుంట ఆగస్టు 03,విజయక్రాంతి: చేగుంట మండల, పట్టణ ప్రజలకు, నిరుపేద కుటుంబాలకు, దేవాలయాల అభివృద్ధికి, ఎల్లప్పుడూ ముందుండి ఆర్థిక సహాయం అందిస్తూ, మానవత్వానికి నిదర్శనంగా నిలుస్తున్న,చేగుంట పట్టణ ఉపసర్పంచ్, మైనార్టీ నాయకులు మొహమ్మద్ రఫీ. సమాజంలో మనుషులంతా ఒక్కటే అనే నినాదంతో, ముందుకు సాగుతున్న ఆయన, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ, ఆరు నెలలుగా నిరంతరంగా ప్రజలకు అండగా నిలుస్తున్నారు.
పట్టణానికి చెందిన శ్రీను అనారోగ్యంతో మరణించగా, భార్య రాణి తన మూడేళ్ల కుమారుడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్న దయనీయ పరిస్థితిని చూసి రఫీ చలించిపోయారు. ప్రభుత్వ పింఛన్ మంజూరయ్యే వరకు ఆ కుటుంబానికి తన సొంత సంపాదన నుంచి ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సహాయం అందిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి క్రమం తప్పకుండా సాయం అందజేస్తున్నారు.
మరోవైపు కులమతాల భేదాలకు అతీతంగా సేవలు అందిస్తున్న ఆయన... పట్టణంలోని ఉజ్జయిని దేవాలయం, పెద్దమ్మ దేవాలయం, చిన్న శివనూరులోని ఆలయంతో పాటు వెల్దుర్తి మండలం తుల్జాపూర్ మహంకాళి దేవాలయాల అభివృద్ధికి లక్షలాది రూపాయల విరాళాలు అందజేస్తూ, దేవాలయాల్లో నిత్య ధూప దీప నైవేద్యాల నిర్వహణ కోసం తన వంతు సహాయంగా ప్రతి నెలా, ఒక్కొక్క గుడికి రూ. 8,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. పదవి వచ్చిన తర్వాత హామీలను మరచిపోయే, నేటి రాజకీయ వాతావరణంలో, నిరుపేదలకు అండగా నిలుస్తూ గత ఆరు నెలలుగా నిరంతరం సేవలు అందిస్తున్న రఫీని చేగుంట మండల, పట్టణ ప్రజలు అభినందిస్తున్నారు. ఆయన సేవాభావం ఇతర ప్రజాప్రతినిధులందరికీ ఆదర్శమని కొనియాడుతున్నారు.






