10 June, 2026 | 1:13 AM

మోదీ @ 4,399

10-06-2026 12:00 AM
  1. స్వతంత్ర భారతంలో అత్యధిక రోజులు ప్రధానిగా మోదీ సేవలు
  2. నెహ్రూ రికార్డు బద్ధలు

న్యూఢిల్లీ, జూన్ 9: వరుసగా అత్యధిక రోజులు పదవిలో ఉన్న భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. బుధవారానికి (జూన్ 10, 2026) 4,399రోజులు ప్రధానిగా పనిచేస్తూ మోదీ మాజీ ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. 2014 మే 26న తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ అప్పటి నుంచి వరుసగా మూడోసారి పదవిలో కొనసాగుతున్నారు.

వరుసగా అత్యధిక కాలం పనిచేసిన వారిలో ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ తొలిస్థానంలో ఉండగా, రెండో స్థానంలో నెహ్రూ 4,398 రోజులు, మూడో స్థానంలో మన్మోహన్ సింగ్ 3,656 రోజులు కొనసాగనున్నారు. 12 ఏళ్ల మోదీ పాలనలో అనేక సంస్కరణలు చేపట్టారు. ముఖ్యంగా స్వచ్ఛభారత్, ప్రత్యక్ష నగదు బదిలీ, పీఎం ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్ వంటి అనేక పథకాలు, సంస్కరణలకు రూపకల్పన చేశారు. 

కాగా నెహ్రూ 1947 నుంచి 1964లో తన మరణం వరకు 16 సంవత్సరాల 286 రోజులపాటు 6,131 రోజులపాటు పదవిలో ఉన్నారు. 1952 మే 13 నుంచి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రధానిగా నెహ్రూ 1964 వరకు (4,398రోజులు) కొనసాగారు. 1947 ఆగస్ట్ 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన వెంటనే మధ్యంతర ప్రభుత్వ అధిపతిగా నెహ్రూ దేశాన్ని పరిపాలించారు.

రాజ్యాంగం ఆమోదం పొందిన తరువాత దేశంలో తొలిసార్వత్రిక ఎన్నికలు 1951- 52లో జరిగాయి. తొలి లోక్‌సభ ఏర్పడి దేశానికి మొట్టమొదటి అధికారిక ప్రధానిని ప్రభుత్వాన్ని అందజేసింది. అందువల్ల, రాజకీయ విశ్లేషకులు, చరిత్రకారులు నెహ్రూ వాస్తవ ప్రజాస్వామ్యబద్ధ పదవీకాలాన్ని 1952 మే 13 నుంచే లెక్కిస్తారు. ఇది వరుసగా 4,398 రోజుల పాటు కొనసాగింది.