29 May, 2026 | 4:39 AM

మోదీ పెద్ది గురించి అడిగారు!

29-05-2026 02:34 AM

ఢిల్లీ ప్రెస్‌మీట్‌లో టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 4న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను పిల్లలతో కలిసి థియేటర్లలో చూడండి. వాళ్లు చాలా స్ఫూర్తి పొందుతారు. ఇది మట్టి వాసన ఉన్న కథ. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు చాలామంది గిరిజన ప్రాంతాల నుంచే వచ్చారు.

నేను ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసినప్పుడు ‘పెద్ది’ దేని గురించి అని అడిగారు. ‘వికసిత్ భారత్’లాగా గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పా. అప్పుడు ఆయన ఒక ఆసక్తికర విషయాన్ని నాతో పంచుకున్నారు. ‘పశ్చిమ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారు. తామంతా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చామని వాళ్లు చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు.

ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు’ అని మోదీ చెప్పారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అనడానికి నిదర్శనం అది. ‘పెద్ది’ కూడా అలాంటి ఒక కథ” అన్నారు. హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ.. “ఇది చాలా రూటెడ్ ఫిల్మ్. ఇండియాలో, ఇండియన్స్ కోసం నిర్మించిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది” అని తెలిపింది. ‘ఇదొక అద్భుతమైన సినిమా. ఈ చిత్రాన్ని నిర్మించినందుకు చాలా గర్వపడుతున్నా’నని నిర్మాత వెంకట సతీశ్ కిలారు చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో బోమన్ ఇరానీ, దివ్యేందు శర్మ కూడా మాట్లాడారు.