19 July, 2026 | 3:52 AM

బలవంతంగా ఆసుపత్రికి వాంగ్‌చుక్ తరలింపు

19-07-2026 12:59 AM
  1. జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత
  2. పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట
  3. సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే నిరాహార దీక్ష.. ఇంక్‌తో యువతి దాడి
  4. వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యుల వెల్లడి
  5. చికిత్సకు నిరాకరిస్తున్నారని ప్రకటన
  6. మా అనుమతి లేకుండా చికిత్స చేయొద్దు: వాంగ్‌చుక్ సతీమణి గీతాంజలి
  7. ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే ఆసుపత్రికి తరలింపు: ఢిల్లీ పోలీసులు
  8. ప్రశ్నించే గళాలను కేంద్రం అణచివేస్తున్నది: రాహుల్‌గాంధీ

న్యూఢిల్లీ, జూలై ౧౮: ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్న వాతావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్‌ను శనివారం ఉదయం బలవంతంగా సఫ్దార్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ఈక్రమంలో ఆ ప్రాంతంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీక్షాస్థలిని ఖాళీ చేయాలని పోలీసులు నిరసనకారులను కోరారు. నిరసనకారులు అందుకు ససేమిరా అనడంతో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట జరిగింది.

నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీలు, ప్రవేశ పరీక్షల నిర్వహణలో లోపాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహించి, తన పదవికి రాజీనామా చేయాలని వాంగ్‌చుక్ 21 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. వాంగ్‌చుక్‌కు తక్షణం వైద్య సాయం అందించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో పోలీసులు ఆయన్ను బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహించి వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితులపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

వాంగ్‌చుక్ డీహైడ్రేట్ అయ్యారని, శరీరంలో పొటాషియం స్థాయి పడిపోయిందని ప్రకటించారు. మూత్రంలో కీటోన్ స్థాయి పెరిగిందని, శరీరంలో జీవక్రియల సమతుల్యత కూడా దెబ్బతిన్నదని నిర్ధారించారు. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆయనకు చికిత్స అందించాల్సిన అవసర ఉందని కుటుంబసభ్యులకు సూచించామని వివరించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు.

వాంగ్‌చుక్‌తోపాటు మరో ముగ్గురు ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ నేతలు నేహా, అమీన్, మనీష్ కూడా నిరహార దీక్ష చేస్తున్నారని, వీరిలో అమీన్, మనీష్ ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. అయితే.. వాంగ్‌చుక్ మాత్రం చికిత్సను నిరాకరిస్తున్నారు. వైద్యుల సలహాలను నిర్దంద్వంగా తిరస్కరిస్తున్నారు. వైద్యసిబ్బంది స్లున్ ఎక్కించేందుకు, ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించేందుకు యత్నించగా ఆయన నిరాకరిస్తున్నారు.

దీంతో చికిత్సకు సహకరించాలని వైద్యులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితులపై ఆయన వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ నితిన్ దిగే ఆందోళన వ్యక్తం చేశారు. వైద్యనిపుణులు వాంగ్‌చుక్ వైద్య నివేదికలను దాచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 

హైకోర్టు ఆదేశాల మేరకే: ఢిల్లీ పోలీసులు

ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకే వాంగ్‌చుక్‌ను ఆసుపత్రికి తరలించామని, ఈ క్రమంలోనే స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుందని నగర పోలీసులు ‘ఎక్స్’ ద్వారా ప్రకటించారు. జంతర్‌మంతర్ వద్ద నిరసనకారులు సంయమనం పాటించాలని, తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని కోరుతున్నామని తెలిపారు.

సతీమణి గీతాంజలి ఆందోళన

వాంగ్‌చుక్ శరీరంలో పొటాషియం స్థాయి లు ఒక్కరోజులోనే 4.3 నుంచి 2.9కి పడిపోవడంపై ఆయన సతీమణి గీతాంజలి జే అంగ్మో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రి సిబ్బంది తమకు వాంగ్‌చుక్ వైద్యపరీక్షల రిపోర్టులు ఇవ్వడం ఆవేదన వ్యక్తం చేశారు. రక్తం నమూనాలు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వాంగ్‌చుక్‌ను తమకు నచ్చిన ప్రైవేటు ఆసుపత్రికి తరలిస్తున్నామని కోరుతున్నా, ఆసుపత్రి యాజమాన్యం అంగీకరించడం లేదని వాపోయారు.

తమ అనుమతి లేకుండా తన భర్తకు ఎలాంటి చికిత్స అందించొద్దని డిమాండ్ చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే, అందుకు కారణమైన వారిని బాధ్యుల్ని చేస్తానని హెచ్చరించారు. తమ కుటుంబ వైద్యుడి అనుమతి లేకుండా ఏ చికిత్సా అందించేందుకే వీలు లేదని, అది తమ హక్కు అని వాదించారు.

బలప్రయోగం సరికాదు: రాహుల్ 

విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ దీక్షపై బలప్రయోగం సరికాదని ఏఐసీసీ నేత రాహుల్‌గాంధీ మండిపడ్డారు. వైఫల్యాలను ఎత్తిచూపే గళాలను కేంద్ర ప్రభుత్వం అణచివేసేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ‘అసత్యం, హింస’ ప్రధాని మోదీ సిద్ధాంతాలని పేర్కొన్నారు. ఉద్యమకారులను ఏ బలప్రయోగమూ, ఏమీ చేయలేదని రాసుకొచ్చారు.

మాపై పోలీసుల దాడి: దీప్కే 

జంతర్‌మంతర్ వద్ద దీక్షాస్థలి నుంచి వాంగ్‌చుక్‌ను తరలించిన తర్వాత, కాక్రోచెస్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అదే స్థలంలో నిరాహార దీక్ష కొనసాగించారు. పోలీసులు తనను అడ్డుకునే ప్రయత్నం చేశారని, తనపై దాడి కూడా చేశారని దీప్కే ఆరోపించారు. ఈక్రమంలో ఓ యువతి ఉన్నట్టుండి దీప్కే వైపు దూసుకువచ్చింది. ఆయనపై సిరా చల్లింది.