29 June, 2026 | 4:27 PM

మూసీ ప్రాజెక్టు: తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది

29-06-2026 03:07 PM

అభివృద్ధి  మానవీయతల సమన్వయంతో ముందడుగు

భూ సేకరణ, పునరావాస అంశాలపై సమీక్షించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

మూసీ ప్రాజెక్టుతో ఎవరికీ అన్యాయం జరగనీయం

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు'(Musi project) తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధిని తీర్చిదిద్దడంలోనూ, హైదరాబాద్ నగరం రూపురేఖలను మార్చడంలోనూ ఒక చారిత్రాత్మక కార్యక్రమంగా నిలుస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) పేర్కొన్నారు. మూసీ నది పునరుజ్జీవనం ద్వారా నగరానికి కొత్త జీవం పోయడంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేలా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారని తెలిపారు.

ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూ సేకరణ, పునరావాసం, సంబంధిత అంశాలపై మంత్రి సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి రాజీవ్ గాంధీ హనుమంతు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ ఎండి ఇ.వి. నర్సింహారెడ్డి, హెచ్‌ఎండిఎ (HMDA) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో, మూసీ నదిని పునరుజ్జీవింపజేసి దానిని పర్యాటకం, ఉపాధి, ఆర్థిక వృద్ధికి కేంద్రంగా మార్చాలన్నది ముఖ్యమంత్రి దార్శనికత అని సూచించారు. ఇది కేవలం ఒక అభివృద్ధి కార్యక్రమం మాత్రమే కాదని, భావి తరాలకు ఆరోగ్యకరమైన, సురక్షితమైన, పర్యావరణ అనుకూలమైన జీవన వాతావరణాన్ని అందించాలనే సంకల్పంతో చేపట్టిన ప్రాజెక్టని వివరించారు.

దశాబ్దాలుగా మూసీ నది కాలుష్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను, అలాగే వర్షాకాలంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు తెలిపారు. వరద నియంత్రణ, నీటి శుద్ధి, పచ్చదనం పెంపుదల, అలాగే రోడ్లు, పార్కులు, నడక దారులు (walkways), వినోద కేంద్రాల ఏర్పాటు ద్వారా మూసీ తీర ప్రాంతాలను శక్తివంతమైన కొత్త జీవన కేంద్రాలుగా మార్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేసినట్లుగా, మూసీ ప్రాజెక్టు ఎవరికీ వ్యతిరేకం కాదని, ఎవరికీ అన్యాయం జరగకుండా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు.

అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పేదల జీవనోపాధికి ఎలాంటి భంగం కలగకుండా, ప్రతి నిర్ణయాన్నీ మానవీయ దృక్పథంతోనే తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం భూసేకరణ ప్రక్రియలో ప్రజల కోణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, మానవీయ విధానంతో నిర్ణయాలు తీసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇళ్లు కోల్పోతున్న కుటుంబాలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించేందుకు తక్షణమే ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలని ఆదేశించారు. భూములు కోల్పోతున్న వారికి చట్టపరమైన పరిహారం, అవసరమైన పునరావాసం కల్పించే విషయంలో ప్రభుత్వం ఏమాత్రం రాజీపడదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ తేల్చిచెప్పారు.