ప్రతి పల్లె అభివృద్ధి చెందడమే లక్ష్యం
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
అన్నారంలో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
షాద్నగర్ ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పునరుద్ఘాటించారు. గురువారం మండల పరిధిలోని అన్నారం గ్రామంలో పర్యటించిన ఆయన, గ్రామాభివృద్ధికి సంబంధించి పలు కీలక పనులకు శ్రీకారం చుట్టారు. ముందుగా స్థానిక ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడం ద్వారానే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర వికాసం కోసం నిరంతరం శ్రమిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం, గ్రామంలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
పనులను నాణ్యతతో, నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్ లను ఆదేశించారు. తదనంతరం, ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులను కలిసి ఎమ్మెల్యే శంకర్ వారికి శుభాకాంక్షలు తెలుపుతూ నూతన వస్త్రాలను అందజేశారు. స్వంత ఇంటి కల నెరవేరుతున్న తరుణంలో లబ్ధిదారులు తమ ఆనందాన్ని పంచుకుంటూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లావణ్య రామకృష్ణ , భారీ సంఖ్యలో గ్రామస్తులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.




