కార్మిక సమస్యల పరిష్కారానికి కృషిచేస్తా
- కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీకి ఎమ్మెల్యే పాయం మద్దతు
బూర్గంపాడు,(విజయక్రాంతి): కార్మికుల సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని...ఐటీసీ యాజమాన్యంతో మాట్లాడి కార్మికులకు న్యాయం చేస్తానని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఎండను సైతం లెక్కచేయకుండా గత 40 రోజులుగా కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేస్తున్న రిలేనిరాహారదీక్షల శిబిరాన్ని ఆయన సందర్శించి కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన జేఏసీని ఉద్దేశించి మాట్లాడుతూ వేతన ఒప్పందం జాప్యం లేకుండా చేయాలని, పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, 100శాతం మెడికల్ ఇవ్వాలని, వేతనం రూ.22వేలకు తగ్గకుండా అగ్రిమెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నా ఐటీసీ యాజమాన్యం స్పందించకపోవడం సిగ్గుచేటని, స్వయంగా ఐటీసీ యాజమాన్యాన్ని కలిసి కార్మిక సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తానని జేఏసీకి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.






