కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ చెల్లింపులకు రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని, ఆ నిధులను నిర్వాసితులకు చేరేలా కలెక్టర్లు చూడాలిని మంత్రి ఆదేశించారు. కలెక్టర్ల పీడీ ఖాతాల్లో నిధుల జమ సరిపోదుని, ప్రతి రూపాయి లబ్దిదారుడికి చేరాల్సిందే అన్నారు. ప్రభుత్వం రూ.2782 కోట్లు విడుదల చేసిందని, లబ్ధిదారులకు రూ.566 కోట్లు చేరాయని, మరో రూ.989 కోట్ల పంపిణీ వివిధ దశల్లో ఉండగా, రూ.199 కోట్లు జిల్లాల వద్దే ఉన్నాయని ఆయన వెల్లడించారు.
దాదాపు రూ.1200 కోట్లు వెంటనే లబ్ధిదారులకు చెల్లించే అవకాశం ఉందని, అదనంగా రూ.455 కోట్ల టోకెన్లు తదుపరి ప్రక్రియకు సిద్ధమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నిధుల విడుదల, లబ్ధిదారుల ఖాతాల్లో జమకు మధ్య తేడాను కలెక్టర్లు పర్యవేక్షించాలని, అదనపు సిబ్బంది, ప్రత్యేక బృందాలతో పరిపాలన జాప్యం తొలగించాలని సూచించారు. జగిత్యాల జిల్లాలో భూసేకరణ నిధులను ఒకట్రెండు రోజుల్లో పంపిణీ చేయాలని, మల్లన్నసాగర్ ఫీడర్ కెనాల్ 180 ఎకరాలకు కన్సెంట్ అవార్డులు పూర్తి చేయాలన్నారు. అటవీ అనుమతు సమస్యలను ఫాస్ట్ ట్రాక్ లో పరిష్కారించాలని మంత్రి ఉత్తమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.






