ఇక్కుర్తి గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీలు
విద్యుత్, సీసీ కెమెరాలు, ఉచిత తాగునీటి సౌకర్యాలపై హామీ
ఆలేరు,(విజయక్రాంతి): మోటకొండూరులో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఇక్కుర్తి గ్రామ సర్పంచ్ కందుల చిరంజీవి, ప్రజాప్రతినిధులు, నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఇక్కుర్తి గ్రామానికి సింగిల్ ఫేజ్ 24 గంటల విద్యుత్ సరఫరా, సీసీ కెమెరాల ఏర్పాటుతో పాటు గ్రామ ప్రజలకు ఉచితంగా వాటర్ ఫిల్టర్ నీటిని అందించేందుకు ముందుకు వచ్చిన చామకూర ఇండస్ట్రీస్ అధినేత చామకూర శశిధర్ రెడ్డిను ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అభినందించారు.
అలాగే గ్రామంలో ఉన్న 20 ఇనుప విద్యుత్ స్తంభాల స్థానంలో సిమెంట్ స్తంభాలు అవసరమని ఎమ్మెల్యేకు వివరించగా, స్పందించిన ఎమ్మెల్యే వెంటనే 20 సిమెంట్ స్తంభాలను గ్రామానికి పంపించారు. ఇందుకు గ్రామ ప్రజల తరఫున ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మరో 20 సిమెంట్ స్తంభాలు అవసరమని కోరగా, త్వరలోనే అందజేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ దడిగే నవనీత పరుశురాం, చామకూర శశిధర్ రెడ్డి, వార్డు మెంబర్ నామిలే విజయ, స్వామి అయిలి సత్యనారాయణ, గోడ అబ్బ సాయిలు, చె. కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.






