21 August, 2026 | 8:22 PM

త్యాగాలు ఉద్యమకారులవే… భోగాలు బీఆర్‌ఎస్‌వే: కేకే మహేందర్ రెడ్డి

21-08-2026 07:31 PM

కొత్తపల్లి గ్రామ క్రీడాకారులు రాష్ట్రానికి గర్వకారణం

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే సీఎం లక్ష్యం

గంభీరావుపేట,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమంలో త్యాగాలు ఉద్యమకారులవైతే, భోగాలు మాత్రం బీఆర్‌ఎస్ నాయకులవేనని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో త్రో బాల్ రాష్ట్రస్థాయి పోటీల్లో విజయం సాధించిన మహిళా క్రీడాకారులను ఆయన సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... త్రో బాల్ క్రీడలో ప్రతిభ కనబరిచి కొత్తపల్లి గ్రామానికి, ప్రాంతానికి గర్వకారణంగా నిలిచిన క్రీడాకారులను అభినందించారు.

తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని, ఉద్యోగాలు ఇవ్వడం, అభివృద్ధి చేయడం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలిపారు. క్రీడాకారులకు తాను అన్నలా అండగా నిలిచి ప్రోత్సాహం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు పర్శ హన్మాండ్లు, మండల మాజీ అధ్యక్షుడు హమీద్, నాయకులు రాజనర్సింహ రెడ్డి, ఎలుక రాజు, గంగీ స్వామి, అజం, రాజం, రాజారాం రెడ్డి, గోపాల్ రెడ్డి, గణేష్, దేవగౌడ్, రాజయ్య, శ్రీనివాస్, బాలయ్య తదితరులు పాల్గొన్నారు.