21 August, 2026 | 7:52 PM

రూ.12 కోట్లతో పోస్టాఫీస్-హేమచంద్రాపురం రోడ్డు పనులు

21-08-2026 07:09 PM

 సింగరేణి పరిధిలో టెండర్లు పూర్తి

కొత్తగూడెంటౌన్,(విజయక్రాంతి): నియోజకవర్గ పరిధిలోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి శేషగిరినగర్ మీదుగా హేమచంద్రాపురం వరకు రూ.12 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రోడ్డు వెడల్పు, డబుల్ రోడ్డు నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. ఈ మార్గంలో సింగరేణి భారీ వాహనాల రాకపోకల కారణంగా రోడ్డు తీవ్రంగా ధ్వంసమై, ప్రయాణికులు, స్థానిక ప్రజలు నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య తీవ్రతను గుర్తించిన స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, ప్రజల రవాణా కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

రోడ్డు పునర్నిర్మాణం చేపట్టాలని సింగరేణి ఉన్నతాధికారులతో ఆయన పలుమార్లు ప్రత్యేకంగా సమావేశమై, పనుల ఆవశ్యకతపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన నిరంతర కృషి, పట్టుదలకు సింగరేణి యాజమాన్యం సానుకూలంగా స్పందించి తక్షణమే నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో పనుల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను సింగరేణి అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.

అన్ని అనుమతులు పూర్తి కావడంతో త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక డబుల్ రోడ్డు నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తి అయితే పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుంచి హేమచంద్రాపురం వరకు రాకపోకలు సాగించే వాహనదారులకు ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఈ సందర్బంగా కూనంనేని మాట్లాడుతూ త్వరలోనే పనులను ప్రారంభించి, నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసేలా ప్రత్యేక చొరవ తీసుకుంటానని తెలిపారు.