21 August, 2026 | 5:06 PM

సరిహద్దులు సురక్షితంగా ఉంటేనే.. భారత్ సురక్షితం

21-08-2026 04:06 PM

సిలిగురి: తమ సరిహద్దులను సురక్షితం చేసే వరకు పశ్చిమ బెంగాల్ గానీ, భారతదేశం గానీ సురక్షితంగా ఉండవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా(Union Home Minister Amit Shah) శుక్రవారం నాడు స్పష్టం చేశారు. పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ, రాష్ట్రంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుకు కంచె వేయడానికి అవసరమైన భూమిని గత ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. రాష్ట్రానికి చెందిన గత ముఖ్యమంత్రులెవరూ ఎప్పుడూ బీఎస్‌ఎఫ్ (BSF) కార్యక్రమాలకు హాజరుకాలేదని పేర్కొన్న అమిత్ షా, ఆ సంప్రదాయాన్ని బద్దలు కొట్టినందుకు బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని అభినందించారు.

"సరిహద్దు కంచెలను ఏర్పాటు చేయడానికి భూమిని కేటాయించాలంటూ మమతా బెనర్జీకి నేను చేసిన తీవ్ర విజ్ఞప్తులను ఆమె పట్టించుకోలేదు. సరిహద్దు భద్రతను బలోపేతం చేయడానికి 2014 నుండే నేను 1,129 ఎకరాల భూమిని కోరుతూ వచ్చాను. రాష్ట్రంలో అధికారి (Adhikari) ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే మాకు ఆ భూమి లభించింది." అని సిలిగురిలోని ఎస్‌ఎస్‌బి (SSB) సరిహద్దు ప్రధాన కార్యాలయంలో జరిగిన వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో కేంద్ర హోం పేర్కొన్నారు. 

ఎస్‌ఎస్‌బీ అనేది రాజకీయ సంస్థ కాదని పేర్కొన్న షా, గత ముఖ్యమంత్రులు సరిహద్దు దళాల వేడుకలకు దూరంగా ఉండటం తప్పుడు సంకేతాలను పంపిందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి జాతీయ గీతం 'వందేమాతరం'కు గత ప్రభుత్వాలు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం పట్ల తాను బాధపడ్డానని తెలిపారు. "ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటలో పాడేంత వరకు భారతదేశంలో 'వందేమాతరం' పూర్తి పాఠాన్ని ఎప్పుడూ పాడలేదు. బంకిమ్ చంద్ర ఛటోపాధ్యాయ ఈ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన తరుణంలో దేశం దీనిని గుర్తించడం నాకు ఊరటనిస్తోంది," అని అమిత్ షా స్పష్టం చేశారు.