7 April, 2026 | 3:23 AM

పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేయాలి

07-04-2026 01:32 AM

కేరళం ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): కేరళంలో కాంగ్రెస్ గెలుపు కోసం అందరూ ఐకమత్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. సోమవారం కేరళంలోని త్రిస్సూర్ జిల్లాల్లో శ్రీధర్‌బాబు సుడిగాలి ప్రచారం నిర్వహించారు. త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్‌తో కలిసి రెండు రోజులుగా ఒల్లూర్, నట్టిక, కైపమండలం, పుదుక్కాడ్, చలకుడి, కోడుంగల్లూర్, మనలూర్ తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

త్రిస్సూర్ జిల్లాలో 13 శాసనసభ నియోజకవర్గాలు ఉండగా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కేవలం రెండు స్థానాలను మాత్రమే దక్కించుకుంది.  పగలంతా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటున్న శ్రీధర్‌బాబు, రాత్రి వేళల్లో త్రిస్సూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పలు దఫాలు సమావేశాలు నిర్వహించారు. సోమవారం మహారాష్ట్రలోని పశ్చిమ నాగపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే, నాగపూర్ డీసీసీ అధ్యక్షుడు వికాస్ ఠాక్రేలు మంత్రి శ్రీధర్‌బాబును మర్యాదపూర్వకంగా కలిసి ఎన్నికల ప్రచారం తీరుతెన్నులపై మంత్రి చర్చించారు.