5 August, 2026 | 10:20 AM

గ్రామీణ ప్రజారోగ్యమే ధ్యేయంగా సేవలు అందిస్తున్న మంత్రి శ్రీధర్ బాబు, శ్రీను బాబు

05-08-2026 09:16 AM

మహాదేవపూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం

క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షలు, అద్దాలు పంపిణీ లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

మహాదేవపూర్,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నాయకత్వంలో, వారి మార్గదర్శకత్వంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సోదరి, మంథని మాజీ సర్పంచ్ స్వర్గీయ సువర్ణ చంటయ్య సతీమణి స్వర్గీయ సువర్ణ వనమాల (తాయి) స్మారకార్థం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు.

ప్రజారోగ్యానికి నిరంతరం ప్రాధాన్యమిచ్చే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవతో హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, ఓమెగా హాస్పిటల్, కరీంనగర్‌కు చెందిన సుషిత హాస్పిటల్ వైద్యులతో పాటు పుష్పగిరి హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి నిపుణులైన వైద్యులు ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, నియోజకవర్గ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు.

మంత్రి శ్రీధర్ బాబు విజన్‌తో ఇంటింటికీ ఉచిత వైద్యం: టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు

ఈ శిబిరంలో నిర్వహించిన కంటి పరీక్షల్లో అర్హులైన బాధితులకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు ఆలోచనలకు అనుగుణంగా, గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను వారి ముంగిటికే చేరవేయాలనే ప్రధాన లక్ష్యంతోనే ఈ ఉచిత వైద్య శిబిరాలను మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలిపారు.

మంత్రి  ఆశయాల సాధనలో భాగంగా కాటారం డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 680 మందికి హైదరాబాద్‌లో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించి వారికి తిరిగి చూపు ప్రాప్తింపజేశామని శ్రీను బాబు వెల్లడించారు. అంతేకాకుండా, మంథని నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు పర్యవేక్షణలో ఇప్పటివరకు సుమారు 45 వేల మందికి ఉచితంగా కంటి పరీక్షలు, చికిత్సలు అందించి ఆరోగ్య భరోసా కల్పించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా మంత్రి శ్రీధర్ బాబు దిశా నిర్దేశంలో ప్రజా సంక్షేమమే పరమావధిగా ప్రజలకు మరిన్ని విస్తృత స్థాయి ఉచిత ఆరోగ్య సేవలు అందిస్తామని శ్రీను బాబు స్పష్టం చేశారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన వైద్య బృందాలకు, ప్రజాప్రతినిధులకు, కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రజలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.