8 July, 2026 | 2:58 PM

గురుకుల విద్యార్థులతో మంత్రి పొన్నం మాట ముచ్చట

08-07-2026 01:40 PM

- సోలార్ గీజర్ల ఇస్తామని హామీ 

నాగర్‌ కర్నూల్ (విజయక్రాంతి): ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. ఉయ్యాలవాడలోని మహాత్మ జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన మంత్రి తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి పాఠాలు చదివి వారి ప్రతిభను అభినందించిన మంత్రి, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. విద్యార్థుల దినచర్య, భోజనం, క్రీడలు, గ్రంథాలయ వినియోగంపై ఆరా తీశారు.

గురుకులాల్లో మెరుగైన వసతుల కోసం రాష్ట్రవ్యాప్తంగా సోలార్ గీజర్లను ఏర్పాటు చేస్తామని, ఉయ్యాలవాడ పాఠశాలను కూడా వెంటనే ఆ జాబితాలో చేర్చాలని అధికారులను ఆదేశించారు. భోజనం నాణ్యంగా, పరిశుభ్రంగా అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డా. సంగ్రామ్ సింగ్ జీ పాటిల్, ఎమ్మెల్యే డా. రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.