11 April, 2026 | 3:46 PM

Breaking News

ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •   నాకు నమ్మకం ఉంది.. వచ్చేది మా ప్రభుత్వమే: కేటీఆర్   •  

సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు జ్యోతి రావు పూలే

11-04-2026 01:57 PM

వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది

పూలే ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి, జిల్లా కలెక్టర్

ఖమ్మం,(విజయక్రాంతి): సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే అని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం స్థానిక శ్రీ శ్రీ సర్కిల్ వద్ద వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే జయంతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి పాల్గొని, జ్యోతి రావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నేడు మహనీయుడు జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకోవడం గొప్ప గౌరవమని తెలిపారు. సమానత్వ సమాజ నిర్మాణంలో పూలే కీలక పాత్ర పోషించారని అన్నారు. ఆ కాలంలో కుల, మత భేదాలు ఉన్న పరిస్థితుల్లో సామాజిక సంస్కరణలకు పూలే శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. మొదటగా తన భార్య సావిత్రిబాయి పూలేకు విద్యాబోధన చేసి, ఆ తర్వాత ఆమె ద్వారా బాలికల విద్యకు మార్గం సుగమం చేసిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆ రోజుల్లో కుల వివక్ష కారణంగా అనేక వర్గాల ప్రజలను దేవాలయాలు, పాఠశాలల్లోకి అనుమతించని పరిస్థితులను పూలే ధైర్యంగా ఎదిరించి సమాజంలో మార్పు తీసుకువచ్చారని తెలిపారు. అందుకే వారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నా మని అన్నారు.

వెనుకబడిన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత బిసి వర్గానికి 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని సైంటిఫిక్ గా ప్రూవ్  చేసి పూర్తి చిత్తశుద్ధితో ప్రయత్నించిన సంగతి రాష్ట్ర ప్రజలకు తెలుసని, బీసీ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ కుల వివక్ష లేకుండా సమాజం అభివృద్ధి చెందాలని, ప్రతి ఒక్కరూ విద్యను పొందాలని శ్రీ మహాత్మా జ్యోతి రావు పూలే బోధించిన సిద్ధాంతాలని తెలిపారు. ఆ కాలంలోనే మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి అపారమని గుర్తుచేశారు. 

పేదలకు నాణ్యమైన విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు వంటి పలు కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా వారి ఆశయాలను మరోసారి స్మరించుకొని, మంచి సమాజ నిర్మాణం కోసం వారు చూపిన మార్గంలో నడవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జి. జ్యోతి, డిసిహెచ్ఎస్ డా. రాజశేఖర్, జిల్లా అధికారులు, ఖమ్మం ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రతినిధులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, సాంస్కృతిక సారథి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.