ఎస్‌పీఎం మిల్లును సందర్శించిన మంత్రి జూపల్లి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8(విజయ క్రాంతి): పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం కాగజ్నగర్లోని పేపర్ మిల్లును సందర్శించారు. ఈ సందర్భంగా మిల్లుసిబ్బంది ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం మిల్లులోని వివిధ విభాగాలను మంత్రి క్షుణ్ణంగా పరిశీలించారు.
కలప నుంచి కాగితం తయారయ్యే వివిధ దశలను మంత్రి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. కలపను ముక్కలుగా చేయడం (చిప్పింగ్), ఆపై గుజ్జుగా మార్చడం, రసాయనాల వినియోగం నుంచి తుది దశలో పేపర్ రోల్స్ సిద్ధమయ్యే వరకు సాగే సంక్లిష్ట ప్రక్రియను, యంత్రాల పనితీరును మిల్లు సాంకేతిక నిపుణులు ఆయనకు వివరించారు. ఉత్పత్తి, కార్మికుల సంక్షేమం తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె హరిత ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఎస్పీ నితికా పంత్,తదితరులు పాల్గొన్నారు.






