11 July, 2026 | 11:05 PM

భూ రీ సర్వే ప్రక్రియ అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలి

11-07-2026 09:47 PM

రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 

అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి

భూపాలపల్లి,(విజయక్రాంతి): భూ భారతి చట్టం సమర్థవంతంగా అమలు కావాలంటే రాష్ట్రవ్యాప్తంగా భూ రీ సర్వే ప్రక్రియను అత్యంత ప్రాధాన్యతతో నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ, సమాచార గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఖమ్మం ఐడిఓసి కార్యాలయం నుండి భూ రీ సర్వే, భూ భారతి, సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం, ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ, పాఠశాల విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

కాన్ఫరెన్సులో హైదరాబాద్ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్, స్టాంప్స్, రిజిస్ట్రేషన్ సెక్రటరీ రాజీవ్ గాంధీ హనుమంతు, గృహనిర్మాణ శాఖ డైరెక్టర్ వీపి గౌతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిని రద్దు చేసి భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చామని, రైతుల భూములకు పూర్తి భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భూ భారతి అమల్లోకి వచ్చి 15 నెలలు పూర్తయినా ప్రజల అంచనాలకు పూర్తిస్థాయిలో చేరలేకపోయామని తెలిపారు.

ధరణి కాలంలో పెండింగులో ఉన్న 9.26 లక్షల సాదాబైనామా దరఖాస్తుల పరిష్కారం కోసం భూ భారతిలో అవకాశం కల్పించి, హైకోర్టు సమస్యను కూడా పరిష్కరించినప్పటికి అధిక సంఖ్యలో దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయనే అభిప్రాయం ప్రజల్లో ఉందని, తిరస్కరణలకు గల కారణాలను గుర్తించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అందుకోసం శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్ల సేవలను వినియోగించుకోవాలని, రెగ్యులర్ సర్వేయర్లు, లైసెన్స్ సర్వేయర్లు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు ఉద్యోగం లేదా రెగ్యులరైజేషన్ హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు.

పైలట్ ప్రాజెక్టుగా నక్షాలు లేని 413 ప్రాంతాల్లోని ఐదు గ్రామాల్లో నిర్వహించిన రీ సర్వేతో 95 శాతం వరకు భూ సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. తొలి విడతలో ప్రతి జిల్లాలో 70 గ్రామాలను ఎంపిక చేసి రీ సర్వే చేపట్టామని రీ సర్వేకు నాణ్యత గల పరికరాలను  కొనుగోలు చేయాలని, కొనుగోలు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పురోగతిని సమీక్షిస్తామని, మార్చి 2027 నాటికి మూడు విడతల్లో రీ సర్వే పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

రీ సర్వేలో పనిచేసే లైసెన్స్డ్ సర్వేయర్లకు ఎకరానికి రూ.50తో పాటు రవాణా, ఇతర ఖర్చుల కోసం మరో రూ.10 చెల్లించి మొత్తం రూ.60 అందజేస్తామని తెలిపారు. చెల్లింపులు వెంటనే జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధుల్లో చేరని లైసెన్స్డ్ సర్వేయర్లకు గడువిచ్చి, గడువులోగా చేరని వారి లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశించారు. లైసెన్స్డ్ సర్వేయర్లకు బీమా, సామాజిక భద్రత కల్పించే చర్యలు కూడా తీసుకుంటామని వెల్లడించారు. సాదాబైనామా దరఖాస్తులను నిబంధనల ప్రకారం పరిష్కరించి నోటీసులు త్వరిత గతిన జారీ చేయాలని సూచించారు.

పాలేరు నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో వచ్చిన 6,500 రెవెన్యూ సమస్యల్లో 98 శాతం సమస్యలకు భూ రీ సర్వేతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని, పెండింగులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రస్తుత స్థితిలోనే లబ్ధిదారులకు అందజేసి, మిగిలిన పనులకు నిధులు విడుదల చేయాలని ఆదేశించారు. నిధులు విడుదలైనా పనులు చేపట్టని చోట్ల బాధ్యులైన అధికారులపై వెంటనే  చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికను వెంటనే పూర్తి చేసి గుడిసెల్లో నివసించే కుటుంబాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని, మొదటి విడతలో మంజూరు కాని అర్హుల ఇళ్లను కూడా రెండవ విడతలో చేర్చి మంజూరు చేయాలని సూచించారు.

ఇసుక, కంకర సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డీఎస్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ... తొలి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో భూ రీసర్వేను నవంబర్‌ లోపు పూర్తి చేయాలని, రెండవ విడతలో మరో 70 గ్రామాల్లో మార్చి 2027లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే పూర్తయితే సాదాబైనామా దరఖాస్తుల తిరస్కరణలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.

హౌసింగ్ కార్పొరేషన్ ఎండి వీపి గౌతమ్ మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుడిసెలను గుర్తించిన వాటిలో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేసి ఆగస్టు నాటికి రెండు లక్షల ఇళ్ల లక్ష్యాన్ని చేరుకోవాలని, పెండింగులో ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగించాలని సూచించారు.

సెర్ప్ సీఈఒ దివ్య మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల విద్యార్థుల యూనిఫాంలన్నీ స్వయం సహాయక సంఘాల మహిళా టైలర్ల ద్వారానే కుట్టిస్తున్నామని తెలిపారు. టెండర్ ఆలస్యంతో వస్త్రం ఆలస్యంగా వచ్చినప్పటికి జూలై 15లోపు రెసిడెన్షియల్ బాలికలకు, జూలై 30లోపు బాలురకు యూనిఫాంలు అందించాలని సూచించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని ప్రతివిద్యార్థికి కనీసం ఒక జత యూనిఫాం అందేలా కలెక్టర్లు, డీఆర్‌డీఏ, గురుకులాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన స్వయం సహాయక సంఘాల టైలర్లు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారని తెలిపారు.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ... గ్రామాల మధ్య సరిహద్దు సమస్యలపై ప్రత్యేక సమన్వయంతో ముందుకు సాగుతున్నామని, భూ రీ సర్వేను నిర్ణీత సమయంలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, భూపాలపల్లి, కాటారం ఆర్డిఓలు హరికృష్ణ, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.