తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ టౌన్: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అకాల వర్షాలతో కొల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో తడిసిన వరి, మక్కజొన్నలను వెంటనే కాంటా వేసి తరలించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈసారి మొక్కజొన్న దిగుబడి అధికంగా రావడంతో ప్రభుత్వ గోదాములు సరిపోక కాటన్ మిల్లులు, ప్రైవేట్ గోదాములు, ఫంక్షన్ హాళ్లను కూడా వినియోగించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వంపై నెపం మోపుతోందని మంత్రి ఆరోపించారు. హమాలీల కొరత తీవ్రంగా ఉందని, బీహార్ నుంచి కార్మికులను తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపుల నరసింహ, మున్సిపల్ చైర్‌పర్సన్ రెడ్డి జ్యోతి, వైస్ చైర్మన్ షేక్ రహీం భాష, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజ్, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.






