ప్రజా ఫిర్యాదులో జాప్యం చేయకుండా తక్షణమే స్పందించాలి
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ
గంభీరావుపేట,(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పనితీరు, కేసుల దర్యాప్తు పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలను సమీక్షించారు. ఈ సందర్భంగా నమోదైన కేసులు, పెండింగ్ దర్యాప్తు, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు, పెట్రోలింగ్ వ్యవస్థ, రౌడీషీటర్లు మరియు నేరస్తులపై నిఘా అంశాలను పరిశీలించారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అందుతున్న సేవల నాణ్యతపై కూడా ప్రత్యేకంగా ఆరా తీశారు.
అత్యవసర సేవల కోసం డయల్ 100 స్థానంలో అమల్లోకి వచ్చిన డయల్ 112 గురించి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులకు ఆదేశించారు. ఫిర్యాదులపై తక్షణ స్పందన ఇవ్వాలని, విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతాభావం పెంచాలని సూచించారు.రాత్రి వేళల్లో గ్రామాల్లో పెట్రోలింగ్ ముమ్మరం చేసి రౌడీషీటర్లు, హిస్టరీషీటర్ల కదలికలను పర్యవేక్షించాలని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సి.ఐ వెంకటేష్, ఎస్.ఐ శ్రీకాంత్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.






