5 August, 2026 | 10:35 PM

నల్లమలలో చెంచుల జీవనంపై మానవ హక్కుల కమిషన్ దృష్టి

05-08-2026 09:52 PM

* రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ 

* విద్య, వైద్యం, సంక్షేమం, మౌలిక వసతులపై క్షేత్రస్థాయి పరిశీలన

*  అధికారులతో సమీక్ష.. చెంచు కుటుంబాలతో ముఖాముఖి

అచ్చంపేట: నల్లమల్ల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న చెంచు గిరిజనుల జీవన పరిస్థితులు, విద్య, వైద్యం, సంక్షేమ పథకాల అమలు, జీవనోపాధి, మౌలిక వసతులపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ బుధవారం క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా పర్యటనలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల్ల ప్రాంతాన్ని సందర్శించిన ఆయన, చెంచు కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

బ్రహ్మగిరిలోని కృష్ణవేణి అతిథిగృహంలో గిరిజన సంక్షేమ, వైద్య, విద్య, అటవీ, ఐటీడీఏ, పంచాయతీరాజ్, పోలీసు తదితర శాఖల అధికారులతో సమావేశమై సంక్షేమ పథకాల అమలు, విద్య, వైద్య సేవలు, తాగునీరు, విద్యుత్, రవాణా, ఉపాధి అవకాశాలపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్హులైన ప్రతి చెంచు కుటుంబానికి ప్రభుత్వ పథకాలు చేరేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం బ్రహ్మగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు, హాజరు నమోదు, బోధనా విధానం, మౌలిక వసతులను పరిశీలించారు. ఉపాధ్యాయుల సంఖ్యకు తగ్గట్లుగా విద్యార్థుల నమోదు ఎందుకు లేదని ప్రశ్నించిన ఆయన, గిరిజన పిల్లలు చదువుకు దూరం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

* ఆరోగ్య కేంద్రం పరిశీలన

వట్టువర్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి వైద్యుల హాజరు, మందుల నిల్వలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలు, అత్యవసర వైద్యం, అడవి ప్రాంతాలకు మొబైల్ వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రతి చెంచు కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. మల్లయ్యపెంట గ్రామంలో చెంచు గిరిజనులతో ప్రత్యేకంగా సమావేశమైన కమిషన్ చైర్మన్ వారి జీవనోపాధి, అటవీపై ఆధారపడిన జీవనం, పిల్లల విద్య, ఆరోగ్యం, తాగునీరు, రహదారులు, గృహాలు, రేషన్, పెన్షన్లు, ఉపాధి హామీ పనులు తదితర సమస్యలను తెలుసుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు వినిపించిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

చెంచు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కీలకమని పేర్కొన్న డాక్టర్ షమీమ్ అక్తర్, విద్య, వైద్యం, పోషకాహారం, గృహవసతి, తాగునీరు, విద్యుత్, రవాణా వంటి ప్రాథమిక అవసరాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండరాదన్నారు. చెంచు గిరిజనుల హక్కుల పరిరక్షణతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలు కావాలని సూచించారు. పర్యటనలో ఇన్‌చార్జి ఐటీడీఏ పీఓ, అచ్చంపేట ఆర్డీఓ యాదగిరి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటయ్య, జిల్లా వైద్యాధికారి డాక్టర్ కృష్ణ, జిల్లా విద్యాశాఖ అధికారి ఏ. రమేష్‌కుమార్, అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాసులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.