19 May, 2026 | 5:03 PM

పాలమూరుపై బీఆర్ఎస్‌ది సవతి తల్లి ప్రేమ: మంత్రి జూపల్లి

19-05-2026 04:10 PM

కాళేశ్వరం పూర్తి చేసినట్లు పాలమూరు ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదు?

కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టింది కేసీఆర్

హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Undivided Mahabubnagar District) ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి రేవంత్ రెడ్డి పలు కీలక సూచనలు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు(Palamuru-Rangareddy Lift Irrigation Project) సంబంధించి భూసేకరణ ప్రక్రియను దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి వీలయినంత త్వరగా భూసేకరణ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. భూసేకరణ నిధుల విషయంలో జాప్యం జరగకుండా వెంటనే చెల్లింపులు జరిగేలా చూస్తామని సీఎం తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజాప్రతినిధులు CLP కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్ నేతలు మాట్లాడారని మంత్రి జూపల్లి(Minister Jupally Krishna Rao) పేర్కొన్నారు. మొత్తం బీఆర్ఎస్ నేతలను ప్రశ్నిస్తున్నా అన్నారు. రెండేళ్లలో పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేస్తానని ఆనాడు కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) అన్నారు. రూ. లక్ష కోట్ల ప్రాజెక్టుపై రూ. 25 కోట్లే ఖర్చు పెట్టారని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని జూపల్లి మండిపడ్డారు. కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ కాంగ్రెస్ హయాంలో వచ్చినవే అన్నారు.

కాళేశ్వరం పూర్తిచేసినట్లు పాలమూరు ప్రాజెక్టు(Palamuru Project) ఎందుకు పూర్తి చేయలేదు?అని ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు బీఆర్ఎస్ తేలేకపోయిందన్నారు. పాలమూరు-రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు తెచ్చి తీరుతామని తేల్చిచెప్పారు. పాలమూరుపై బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ది సవతి తల్లి ప్రేమ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కృష్ణా జలాలపై హక్కులను తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని జూపల్లి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కన్నా ఎక్కువే వరి కొనుగోలు చేశామని మంత్రి వెల్లడించారు.