31 July, 2026 | 9:12 AM

మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత

31-07-2026 08:16 AM

హైదరాబాద్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Former MLA Peddi Sudarshan Reddy passes away) కన్నుమూశారు. ఆయన వయసు 51 సంవత్సరాలు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో రాత్రి 12.51 గంటలకు పెద్ది సుదర్శన్ తుది శ్వాస విడిచారు. పెద్ది సుదర్శన్ యశోద ఆస్పత్రిలో ఐదు రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన గుండె నొప్పి, నాడీ వ్యవస్థ నిర్వీర్యంతో సుదర్శన్ రెడ్డి మృతి చెందినట్లు యశోద వైద్యులు ప్రకటించారు. 1974 ఆగస్టు 6న ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లిలో సుదర్శన్ రెడ్డి జన్మించారు. విద్యార్థి రాజకీయాల్లో పెద్ది సుదర్శన్ క్రియాశీలంగా ఉన్నారు. పెద్ది సుదర్శన్ కాంగ్రెస్ పార్టీలోనూ పనిచేశారు.

2001లో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2001లో దుగ్గొండి నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)తో తెలంగాణ ఉద్యమంలో సుదర్శన్ రెడ్డి చురుగ్గా పనిచేశారు. టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పెద్ది బాధ్యతలు చేపట్టారు. 2014లో నర్సంపేట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి ఓడిపోయారు. 2016 నుంచి రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్(Chairman) గా విధులు నిర్వహించారు. 2018 లో నర్సంపేట(Narsampet Former MLA) నుంచి మొదటి సారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2023 లో మూడో సారి నర్సంపేట నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికకాయం తొలత హనుమకొండకు తరలించి, అనంతరం నర్సంపేట మీదగా నల్లబెల్లికి తరలించనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.