మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారె
దమ్మపేట,(విజయక్రాంతి): దమ్మపేట మండల కేంద్రంలోని విశ్రాంత ఉపాధ్యాయుల కమ్యూనిటీ భవనానికి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కాంపౌండ్ వాల్ నిర్మాణ పనుల శంకుస్థాపన కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. అనంతరం మండల పరిధిలోని నాగుపల్లి, నాచారం, మొద్దులగూడెం గ్రామపంచాయతీలలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ విస్తృతంగా పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల వివాహం జరిగిన నూతన దంపతులను కలిసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్న పలువురు బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పర్యటన సందర్భంగా ఆయా గ్రామపంచాయతీల పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్థానికులతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన పనులను దశలవారీగా పరిష్కరిస్తామని తెలిపారు. నాచారం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, దమ్మపేట సొసైటీ చైర్మన్ ఎల్లిన రాఘవరావు ఇటీవల తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని స్వయంగా తెలుసుకున్నారు.
పర్యటనలో భాగంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం పూర్తిగా కాబడి గృహప్రవేశాలు నిర్వహించిన లబ్ధిదారులను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అంకంపాలెం గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గిరిజన విద్యార్థినులకు మెరుగైన విద్యా వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, వైస్ సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కక్కిరాల రమేష్, పగడాల కృష్ణారావు, అయ్యప్ప, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.






