ఘనంగా పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి
దమ్మపేట,(విజయక్రాంతి): అమరజీవి, మహానేత భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనేత, సాయుధ తెలంగాణ పోరాట రథసారథి, ప్రజల మనిషి, దక్షిణ భారత కమ్యూనిష్టు నిర్మాత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 41వ వర్ధంతి దమ్మపేట సిపిఎం పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో, సిపిఎం పార్టీ మండల కార్యాలయం సుందరయ్య భవనంలో, మండల కమిటీ సభ్యులు పిల్లి నాయుడు అధ్యక్షతన మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత సుందరయ్య చిత్రపటానికి పార్టీ సీనియర్ నాయకులు యండ్రాతి అప్పారావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం జరిగిన సభలో వక్తలుగా మండల కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మినారాయణ, యండ్రాతి అప్పారావు, పిల్లి నాయుడులు మాట్లాడుతూ తెలుగు నాట కమ్యూనిజం అనగానే ముందుగా గుర్తుకువచ్చే పేరు పుచ్చలపల్లి సుందరయ్యని, కోట్లాది రూపాయల ఆస్తిని, భూములను పేదల కోసం త్యాగం చేసి, ఆఖరి శ్వాస వరకు ప్రజా శ్రేయస్సు కోసమే జీవించిన మహోన్నత వ్యక్తి ఆయననీ, నెల్లూరు జిల్లా అలగానిపాడులో ఒక సంపన్న జమీందారీ కుటుంబంలో జన్మించిన సుందరయ్య, తన పేరు చివర ఉన్న కుల సూచకమైన రెడ్డి అనే పదాన్ని తొలగించుకుని, సమాజంలో సమానత్వం కోసం 'సుందరయ్య'గా మార్చుకున్నారని
తన వాటాగా వచ్చిన వందలాది ఎకరాల భూమిని పేదలకు పంచేసి, నిరుపేదగా ప్రజా జీవితంలోకి అడుగుపెట్టారని, తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం నవాబు రజాకార్ల అరాచకాలకు వ్యతిరేకంగా, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సుందరయ్య ముందుండి నడిపించారనీ, గెరిల్లా పోరాట యోధుడిగా అడవుల్లో తిరుగుతూ, ప్రజలను చైతన్యపరిచి, దాదాపు 30 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచడంలో కీలక పాత్ర పోషించారనీ, స్వతంత్ర భారతదేశంలో తొలి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా (రాజ్యసభలో) ఆయన సేవలు అందించారనీ, ఎంపీగా ఉన్న కాలంలో కూడా ఆయన ఎంతో సామాన్యమైన జీవితాన్ని గడిపారనీ, పార్లమెంటుకు సైకిల్‌పై వెళ్లడం ఆయన నిరాడంబరతకు నిదర్శనమనీ,
ఆయన రాసిన "తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం - పాఠాలు" అనే గ్రంథం నేటికీ విప్లవ, సామాజిక ఉద్యమాలకు ఒక దిక్సూచియని, చివరి శ్వాస వరకు ప్రజా సేవలో నిమగ్మయ్యారని, తన జీవితాంతం లభించిన వేతనాన్ని, అలవెన్సులను పార్టీకి, ప్రజా సేవా కార్యక్రమాలకే ధారపోశారనీ, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన ఆశయాలు, విలువలతో కూడిన రాజకీయం ఎప్పటికీ ఆదర్శనీయమనీ కొనియాడారు. కామ్రేడ్ సుందరయ్య వర్గ పోరాటాలతో బాటుగా సామాజిక ఉద్యమాలతో ప్రేరణ ఇచ్చిన గొప్ప విప్లవ కారుడనీ, ఆదర్శ జీవి, గొప్ప పార్లమెంటేరీయన్, ప్రజలకు సేవ చేసే ప్రజాప్రతినిధిగా వెలుగొందిన మహానేత సుందరయ్యనీ,
1936లో వ్యవసాయ కార్మిక సంఘం స్తాపించి వారి కూలీ రేట్లు పెంచటం కోసం ఉద్యమాలు నడిపి, వారికి న్యాయం జరిగే వరకూ పోరాటం చేసిన యోధుడు సుందరయ్యని కొనియాడుతూ ఆదర్శ మూర్తి కి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కొప్పుల శ్రీనివాసరావు, రావుల శోభన్ బాబు, కొలికి పోగు శ్రీనివాస రావు, కారం లెనిన్, మోరంపూడి రామ మోహన రావు, మోరంపూడి సూర్య నారాయణ, చెన్నుబోయిన బ్రహ్మయ్య, తంగెళ్ళమూడిరమేష్, నారపోగు అనిల్ కుమార్, మోటేపల్లి ధర్మయ్య, హెచ్చు మల్లేశ్వర రావు, జగన్నాథ శ్రీనివాస్ రావు, రవి తదితరులు పాల్గొన్నారు.






