11 March, 2026 | 4:16 AM

చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం

11-03-2026 12:27 AM

విద్యార్థుల హాజరు, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

చేవెళ్ల, మార్చి 10 (విజయక్రాంతి): పేద విద్యార్థుల విద్యాభ్యాసానికి ఆకలి అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఏ.జీ. కార్యాలయ ఉద్యోగుల చారిటీ ట్రస్ట్ వారి ఉదారతతో ఈ వినూత్న కార్యక్రమం రూపుదిద్దుకుంది.ఏప్రిల్ నెల వరకు విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించేందుకు చారిటీ ట్రస్ట్ విరాళం అందజేసింది.

విద్యార్థుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు, కళాశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు ఈ భోజన సదుపాయం ఎంతో ఊరటనిస్తోంది. పథకం వల్ల విద్యార్థుల్లో విద్యాభ్యాసం పట్ల ఆసక్తి పెరగడమే కాకుండా, వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. విరాళం అందించిన ట్రస్ట్ సభ్యులకు కళాశాల తరపున ప్రిన్సిపాల్ కృతజ్ఞతలు తెలిపారు.

ఆకలి తీర్చడమే కాకుండా, సమాజం పట్ల బాధ్యతను, సేవా భావాన్ని ప్రతిబింబిస్తోందని కళాశాల యాజమాన్యం కొనియాడింది. కార్యక్రమంలో ఏ.జీ. కార్యాలయ ట్రస్ట్ సభ్యులు, కళాశాల అధ్యాపక బృందం మరియు సిబ్బంది పాల్గొన్నారు.