మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి
- డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్
మంచిర్యాల అర్బన్,(విజయక్రాంతి): విద్యార్థులు మత్తు పదార్థాలకు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ కోరారు. మంగళ వారం మంచిర్యాల ఐటిఐ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూషన్(Mancherial ITI Advance Training Institution)లో విద్యార్థులకు ‘మానసిక ఆరోగ్యం - డ్రగ్స్ అడిక్షన్’(Mental health and drug addiction) పైన నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాదకద్రవ్యాలు, వాటి వలన వచ్చే అనర్థాలపైన అవగాహన కలిగించారు. యువత మాదకద్రవ్యాలకు బానిస కావద్దని, మాదకద్రవ్యాలు(Drugs) ఆరోగ్యాన్ని మాత్రమే పాడు చేయవని, మీ సామర్థ్యాన్ని, మీ శక్తిని, మీ జ్ఞానాన్ని నశింపజేస్తాయని, మీ సంబంధాలకు దూరం చేస్తాయన్నారు.
మాదకద్రవ్యాల మత్తు స్వల్పకాలిక సమస్య అయినా ఇది దీర్ఘకాలిక ఊపిరితిత్తులు, కాలేయ వ్యాధి వంటి అనారోగ్య సమస్యలకు(Health problems) దారితీస్తుందని, మానవ శరీరంపై ప్రభావం చూపుతుందన్నారు. వివిధ ప్రాంతాల నుంచి, గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగరాదని, స్నేహితులతో కలిసి తిరగడం, చెడు అలవాట్లు, చెడు ఆలోచనలు భవిష్యత్తును నాశనం చేస్తాయి కావున తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మానసిక పరివర్తనలో ఎలాంటి మార్పులు సంభవించినా, ఎలాంటి సమస్యలున్నా ఉచిత కౌన్సిలింగ్ కోసం మానసిక నిపుణులను (14416) సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. యువత మత్తును వీడి ఆరోగ్య మానసిక, శారీరక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.






